Sitara | సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. డ్యాన్స్ వీడియోలు, వెకేషన్‌కు సంబంధించిన పోస్టులతో ఇప్పటికే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సితార.. తాజాగా మరో విభిన్నమైన కోణంతో వార్తల్లో నిలిచింది. ఫహాద్ ఫాజిల్ నటించిన ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆమె చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇప్పటివరకు సితార ఎక్కువగా ఇంగ్లీష్‌లోనే మాట్లాడే వీడియోలు సోషల్ మీడియాలో కనిపించేవి. తెలుగు మాట్లాడినా అప్పుడప్పుడు మాత్రమే వినిపించేది. అయితే తాజాగా మాత్రం అందుకు పూర్తి భిన్నంగా అచ్చమైన తెలంగాణ యాసలో ఆమె మాట్లాడిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ సినిమాలో మ్యాజిక్ చేసే పాత్రలో నటించిన సారా పాలేకర్‌తో కలిసి సితార ఈ ప్రమోషనల్ వీడియోలో కనిపించింది. సారా మ్యాజిక్ ట్రిక్స్ చేస్తుంటే.. వాటిని చూస్తూ సితార ఇచ్చిన రియాక్షన్స్ చాలా సహజంగా ఉన్నాయి.ముఖ్యంగా ‘ఆగు.. ఇటు రా’, ‘ఇట్లానా.. అట్లానా?’ అంటూ సితార పలికిన మాటలు పక్కా హైదరాబాద్, తెలంగాణ యాసను గుర్తు చేస్తున్నాయి. కృత్రిమంగా కాకుండా చాలా సహజంగా ఆమె ఆ మాటలను పలకడంతో వీడియో చూసిన నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు. వీడియోలో సారా పాలేకర్ సితారను తదుపరి ట్రిప్ ఎక్కడికి వెళ్లాలని అనుకుంటున్నావని అడుగుతుంది. అందుకు సితార ‘మూన్‌కి వెళ్దాం.. ఆ తర్వాత మార్స్‌కి పోదాం’ అంటూ చెప్పిన విధానం సరదాగా ఆకట్టుకుంది.
ఆమె మాట్లాడే తీరు, తెలంగాణ యాస, సహజమైన హావభావాలు వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇప్పటివరకు సోషల్ మీడియాలో సితారను ఎక్కువగా అంతర్జాతీయ వాతావరణానికి దగ్గరగా కనిపించే స్టార్ కిడ్‌గా చూసిన అభిమానులకు.. ఈ కొత్త తరహా వీడియో మరింత దగ్గరగా అనిపిస్తోంది. సితారకు ఇంగ్లీష్‌తో పాటు తెలుగు భాషపై కూడా మంచి పట్టు ఉన్నప్పటికీ.. సాధారణ సంభాషణల్లో ఆమె ఎక్కువగా ఇంగ్లీష్‌నే ఉపయోగిస్తుంటుంది. అలాంటి సితార ఇప్పుడు పక్కా తెలంగాణ యాసలో మాట్లాడటం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. మహేష్ బాబు అభిమానులతో పాటు సితారను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారు కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ ఆమె కొత్త లుక్, మాటతీరుపై స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి ఓవర్ యాక్షన్ లేకుండా సహజంగా మాట్లాడటం వీడియోకు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది.