Ramayana | భారతీయ పురాణ కథను ప్రపంచ స్థాయిలో ఆవిష్కరించేందుకు తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ: పార్ట్ 1’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నితీష్ తివారి దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ విజువల్ ఎపిక్ కోసం భారతీయ ప్రేక్షకులతో పాటు విదేశీ సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్‌కు అంతర్జాతీయ స్థాయిలో మంచి స్పందన రావడంతో.. ఇప్పుడు చిత్రబృందం విదేశీ మార్కెట్లలో ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసింది. తాజాగా హాలీవుడ్ థియేటర్లలో ‘రామాయణ’ ప్రత్యేక ట్రైలర్‌ను ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది.
కెనడాలోని మల్టీప్లెక్స్ థియేటర్లలో హాలీవుడ్ చిత్రం ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ప్రదర్శన సందర్భంగా ‘రామాయణ’కు సంబంధించిన సుమారు 1 నిమిషం 22 సెకన్ల ఇంగ్లీష్ ప్రత్యేక ట్రైలర్‌ను ప్రదర్శించినట్లు సమాచారం. భారీ తెరపై ఈ ట్రైలర్‌ను చూసిన ప్రేక్షకులు తమ స్పందనలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో వీడియోలు వైరల్‌గా మారాయి. ‘రామాయణ’ను కేవలం భారతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నట్లు చిత్రబృందం ఇప్పటికే స్పష్టం చేసింది. అందులో భాగంగానే ఇంగ్లీష్ ట్రైలర్, అంతర్జాతీయ ప్రచార కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తోంది. థియేటర్లలో హాలీవుడ్ చిత్రాల ప్రదర్శన సమయంలో ‘రామాయణ’ ప్రత్యేక ట్రైలర్‌ను చూపించడం కూడా ఈ అంతర్జాతీయ ప్రచారంలో భాగంగానే కనిపిస్తోంది.
ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ ఉన్న సూపర్ హీరో చిత్ర ప్రదర్శనకు వచ్చే ప్రేక్షకులకు భారతీయ పురాణ కథను పరిచయం చేయడం సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో మరింత దృష్టిని తీసుకురావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రైలర్లో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడిగా, సాయి పల్లవి సీతాదేవిగా కనిపిస్తున్న తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే వీరి పాత్రలకు సంబంధించిన లుక్స్‌పై భారీ ఆసక్తి నెలకొనగా.. తాజాగా థియేటర్లలో ప్రదర్శించిన ప్రత్యేక ట్రైలర్‌తో అంచనాలు మరింత పెరిగాయి.రణబీర్ శ్రీరాముడిగా కనిపించే సన్నివేశాలు, యశ్ రావణుడి పాత్రలో చూపించే ప్రతాపం, సాయి పల్లవి సీతగా కనిపించే భావోద్వేగ సన్నివేశాలు ట్రైలర్లో హైలైట్‌గా నిలిచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారీ యుద్ధ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ అంతర్జాతీయ ప్రమాణాలను తలపించేలా ఉన్నాయని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. మొత్తానికి హాలీవుడ్ థియేటర్లలోనే ‘రామాయణ’ ట్రైలర్‌ను ప్రదర్శించడం భారతీయ సినిమా అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.
Ramayana Update : A Short 1 min 22 Second Cut of #Ramayana English Trailer is being attached with major Hollywood releases in Overseas.
This video is from Canada, Trailer attached with Spider-Man Brand New Day. pic.twitter.com/zBydg8AjCo
— KBP Reviews🏹 (@KshitizCritic) September 9, 2026