మోత్కూరు, జూలై 30 : ‘తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఉన్నా ప్రయోజనం లేదు. మున్సిపల్ పాలకవర్గం, అధికారులు పట్టించుకోరు. నిత్యం తాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నం. మా గోడు ఎవరికి చెప్తామన్నా వినిపించుకునే వారు లేరు. నెల రోజులుగా తాగు నీటికోసం పడరాని పాట్లు పడుతున్నం’ అని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని డాగ్బంగ్లా ఏరియా మహిళలు వాపోయారు.
ఓట్ల కోసం వచ్చినప్పుడు అది చేస్తాం.. ఇది చేస్తాం అని గప్పాలు కొట్టిన ఎమ్మెల్యే సామేలు.. గెలిచిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా ప్రజల గోడు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గురువారం మోత్కూరు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.అధికారులు తక్షణమే నీటి సరఫరా పైప్లైన్ పనులను పునరుద్ధరించి తాగు నీటి ఇబ్బందులు తొలగించాలని కోరారు. పోలీసులు వచ్చి ఆందోళనను విరమింపజేశారు.