ఆదిలాబాద్, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో రాష్ట్రంలో పది ఐటీ టవర్లను నిర్మించాలనే ఆలోచన చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా మావల ప్రాంతంలో నిర్మిస్తున్న ఐటీ టవర్ నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జాన్సన్ నాయక్‌తో కలిసి పరిశీలించారు. ఆదిలాబాద్ వంటి వెనుకబడిన జిల్లాల్లో ఐటీ ఫలాలు అందించాలనే ఆలోచనతో మాజీ మంత్రి జోగు రామన్న కోరిక మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ టవర్‌ను మంజూరు చేసినట్టు తెలిపారు.
ప్రస్తుతం మొదటి దశ పనులు కొనసాగుతున్నాయని, 700 మంది యువతకు ఉపాధి కల్పించే విధంగా ఐటీ టవర్‌ను మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. రెండో దశ పూర్తయితే 6 వేల నుంచి 7 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. నిజామాబాద్‌తోపాటు ఆదిలాబాద్‌లో ఉద్యోగాలు భర్తీ చేయాలని కేటీఆర్ సూచించారు. ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమపరిశ్రమను పునరుద్ధరించడంలో రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయని, ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని అన్నారు. గతంలో కేంద్ర మంత్రి అమిత్ షా ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని, బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఆ దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు.