అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన విషాదకరమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో (Air India plane crash) మరణించిన 241 మందిలో మహారాష్ట్రకు చెందిన పది మందికిపైగా వ్యక్తులు ఉన్నారు. మృతుల్లో ఏడుగురు విమాన సిబ్బంది. కెప్టెన్ సుమీత్ పుష్కరాజ్ సభర్వాల్, కో పైలట్ క్లైవ్ కుందర్ ముంబైకు చెందిన వారు. బాద్లాపూర్కు చెందిన క్యాబిన్ సిబ్బంది దీపక్ పాఠక్ 11 ఏళ్లుగా ఎయిర్ ఇండియాలో పని చేస్తున్నాడు.
కాగా, విమాన ప్రమాదంలో మరణించిన ఎయిర్ హోస్టెస్ 23 ఏళ్ల మైథిలి పాటిల్, నవీ ముంబైలోని నవా ప్రాంతంలో నివసిస్తున్నది. రెండేళ్ల కిందటే ఎయిర్ ఇండియాలో చేరింది. మరో ఎయిర్ హోస్టెస్ 43 ఏళ్ల అపర్ణ మహాదిక్, గోరేగావ్ నివాసి. ఆమె భర్త కూడా ఎయిర్ ఇండియాలో సిబ్బందిగా పని చేస్తున్నాడు. ఎన్సీపీ నేత సునీల్ తత్కరే బంధువు ఆమె.
మరోవైపు డోంబివిల్లీలో నివసించే రోష్ని రాజేంద్ర సోంఘారే, జుహు కోలివాడకు చెందిన సైనీతా చక్రవర్తి కూడా ఎయిర్ ఇండియాలో సిబ్బందిగా పని చేస్తున్నారు. వీరిద్దరూ కూడా ఈ ప్రమాదంలో మరణించారు. ట్రావెల్ బ్లాగ్‌ను నిర్వహించే రోష్నికి ఇన్‌స్టాగ్రామ్‌లో 54,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
కాగా, సోలాపూర్ జిల్లాలోని సంగోలాలోని హతీద్ గ్రామానికి చెందిన 60 ఏళ్ల మహాదేవ్ పవార్, 60 ఏళ్ల భార్య ఆశా కూడా ఈ విమాన ప్రమాదంలో చనిపోయారు. మహాదేవ్ 15 ఏళ్లుగా గుజరాత్లో స్థిరపడ్డారు. లండన్‌లో ఉన్న తమ కుమారుడ్ని చూసేందుకు విమానంలో ప్రయాణించిన భార్యాభర్తలు మృత్యువాతపడ్డారు. మరో ప్రయాణికురాలు 32 ఏళ్ల యషా కామ్దార్ మోధా, నాగ్‌పూర్ వ్యాపారవేత్త మనీష్ కామ్దార్ కుమార్తె. తన కుమారుడు రుద్ర, అత్త రక్షాబెన్తో కలిసి లండన్‌కు బయలుదేరిన ఈ ముగ్గురు విమాన ప్రమాదంలో చనిపోయారు.
Also Read:
విమాన శిథిలాల నుంచి.. డిజిటల్ వీడియో రికార్డర్‌ను స్వాధీనం చేసుకున్న గుజరాత్ ఏటీఎస్
బోయింగ్ 787-8 విమానాలను గ్రౌండింగ్ చేసేందుకు కేంద్రం యోచన
బ్లాక్ బాక్స్ ఇంకా దొరకలేదు : ఎయిర్ ఇండియా