Powerful Earthquakes | రష్యా (Russia)ను భారీ భూకంపం వణికించిన విషయం తెలిసిందే. రష్యా తీరంలోని కంచట్కా (Kamchatka) ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్ తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో అత్యంత శక్తిమంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రతను 8.7గా గుర్తించారు. ప్రపంచంలోనే ఈ స్థాయిలో భూకంపం రావడం 2011 తర్వాత మళ్లీ ఇదే తొలిసారి. ఈ భూకంపం తీవ్రతతో రష్యాతోపాటు జపాన్, అమెరికా తీర ప్రాంతాలను సునామీ తాకింది (Tsunami warning). దాదాపు 30 దేశాలపై ఈ సునామీ ఎఫెక్ట్ పడింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ ప్రపంచాన్ని వణికించిన 10 అత్యంత శక్తివంతమైన భూకంపాల (most powerful earthquakes in history) గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1,600 మందిని బలితీసుకున్న గ్రేట్ చిలీ భూకంపం..
దక్షిణ అమెరికా దేశమైన చిలీని 1960లో అత్యంత శక్తిమంతమైన భూకంపం సంభవించింది. బియోబియో ప్రాంతంలో 9.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంపం ధాటికి చిలీ అతలాకుతలమైంది. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ భూకంపాన్ని వాల్డివియా భూకంపం లేదా గ్రేట్ చిలీ భూకంపం అని పిలుస్తారు. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా నమోదైన భూకంపాల్లో ఇదే అత్యంత శక్తివంతమైనది. ఈ భూకంపం ధాటికి 1,655 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు రెండు మిలియన్ల మందికిపైగా నిరాశ్రయులయ్యారు.
అలస్కాను కుదిపేసిన గుడ్‌ఫ్రైడే భూకంపం..
1964లో అమెరికా రాష్ట్రమైన అలస్కాను భారీ భూకంపం కుదిపేసింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 9.2గా నమోదైంది. ఈ భూ ప్రకంపనల ధాటికి సునామీ అలలు అలస్కా నగరాన్ని ముంచెత్తాయి. ఈ విపత్తులో 130 మంది ప్రాణాలు కోల్పోయారు. 2.3 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. ఈ భూకంపాన్ని గ్రేట్ అలస్కా లేదా గుడ్‌ఫ్రైడే భూకంపంగా పిలుస్తారు.
సుమత్రా దీవులను కుదిపేసిన భూకంపం.. 2.80 లక్షల మంది మృతి
2004లో ఇండొనేషియాలోని సుమత్రా దీవుల్లో భూకంపం సంభవించింది. 9.1 తీవ్రతతో సంభవించిన ఈ ప్రకంపనలకు సుమత్రా-అండమాన్ దీవుల్లో సునామీ వచ్చింది. ఈ విపత్తులో దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికా అంతటా 2,80,000 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు.
‘గ్రేట్ తోహోకు’ 15 వేల మంది బలి..
2011లో జపాన్ను భారీ భూకంపం తాకింది. తోహోకు ప్రాంతంలో 9.1 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంపం ధాటికి వచ్చిన సునామీ 15 వేల మందిని బలి తీసుకుంది. దాదాపు రెండు లక్షల మంది నిరాశ్రయులను చేసింది. ఈ భూకంపాన్ని గ్రేట్ తోహోకు భూకంపంగా పిలుస్తారు.
ప్రపంచంలోనే తొలిసారి..
1952లో ప్రపంచంలోనే తొలిసారి రష్యాలోని కమ్చట్కా క్రై ప్రాంతంలో 9 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంపం ధాటికి హవాయిలో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో భారీ సునామీ వచ్చింది. ఈ విపత్తులో భారీగా ఆస్తినష్టం సంభవించింది.
చిలీలో 8.8 తీవ్రతతో భూకంపం..
చిలీలోని బియోబియో ప్రాంతాన్ని మరోసారి భూకంపం వణికించింది. 2010లో 8.8 తీవ్రతతో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. క్విరిహ్యూ నగరం సమీపంలో చోటుచేసుకున్న ప్రకంపనలకు 523 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 3,70,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి.
ఈక్వెడార్-కొలంబియా భూకంపంతో 1500 మంది బలి
1906లో ఈక్వెడార్‌ను 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వణికించింది. ఎస్మెరాల్డాస్ ప్రాంతంలో సంభవించిన ఈ ప్రకంపనలకు సునామీ విధ్వంసం సృష్టించింది. ఈ విపత్తులో 1,500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ భూకంపాన్ని ఈక్వెడార్-కొలంబియా భూకంపం అని పిలుస్తారు.
అమెరికాలోని అలస్కాలో గల ర్యాట్ దీవులకు సమీపంలో 1965లో 8.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి 35 అడుగుల ఎత్తైన సునామీ అలలు ఎగసిపడ్డాయి.
1950లో అరుణాచల్ ప్రదేశ్‌లో 8.6 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రకంపనలకు భారీ భవంతులు ఊగిపోయాయి. ఈ విపత్తులో 780 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భూకంపాన్ని ‘అస్సాం-టిబెట్’ భూకంపంగా పిలుస్తారు.
ఇండోనేషియాలోని ఉత్తర సమత్రా తీరంలో 2012లో భారీ భూకంపం సంభవించింది. 8.6 తీవత్రతో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంపం తీవ్రత ఎక్కువే అయినప్పటికీ ప్రాణనష్టం మాత్రం తక్కువే.
Also Read..
Tsunami | భారత్‌కు సునామీ ముప్పులేదు.. స్పష్టం చేసిన ఇన్కాయిస్
Tsunami Warning | సునామీ హెచ్చరికలు.. ఏ దేశాలకు ఎంత ముప్పు ఉందంటే..
Strongest Earthquake: అత్యంత శక్తివంతమైన భూకంపం.. చరిత్రలో ఆరోసారి రికార్డు