మాస్కో: రష్యాలో పసిఫిక్ తీరంలో ఉన్న కామ్చట్కా ద్వీపంలో ఇవాళ అత్యంత శక్తివంతమైన భూకంపం(Strongest Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఆ భూకంప తీవ్రత 8.8గా నమోదు అయ్యింది. అయితే భూగర్భ శాస్త్రవేత్తలు ప్రకారం.. భూకంపాల చరిత్రలో ఇది ఆరవ అత్యంత శక్తివంతమైన భూకంపంగా రికార్డు అయ్యింది. భూగోళాన్ని కుదిపేసిన అతి తీవ్రమైన పది భూకంపాల్లో తాజా భూకంపం నిలుస్తుందని హవాయి వర్సిటీ ప్రొఫెసర్ హెలిన్ జానిస్జెవిస్కీ తెలిపారు. ఇదే స్థాయిలో గతంలో 2010లో చిలీ దేశంలో, 1906లో ఈక్వెడార్‌లో భూకంపం నమోదు అయినట్లు చెప్పారు.
చిలీ భూకంపం క్విరిహు పట్టణంలో సంభవించింది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం ఆ భూకంపం వల్ల సుమారు 523 మంది మరణించారు. మూడున్నర లక్షల ఇండ్లు నేలమట్టం అయ్యాయి. ఇక ఈక్వెడార్‌లో వచ్చిన భూకంపం వల్ల .. అత్యంత బలమైన సునామీ వచ్చింది.ఆ సునామీ వల్ల సుమారు 1500 మంది మరణించారు. శాన్ ఫ్రాన్సిస్కో వరకు ఆ సునామీ అలలు చేరుకున్నాయి.
గతంలో రష్యాలోని కామ్చట్కాలోనే అయిదో శక్తివంతమైన భూకంపం రికార్డు అయ్యింది. 1952లో ఆ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత 9గా తొలిసారి రికార్డు అయ్యింది. ఆ సమయంలో భారీ సునామీ వచ్చింది. అమెరికాలోని హవాయి తీరాన్ని అది తాకింది. దాని వల్ల దాదాపు లక్ష మిలియన్ డాలర్ల నష్టం జరిగింది.
కామ్చట్కా భూకంపం వల్ల జపాన్, అమెరికా తీరాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.