Jagdeep Dhankhar | దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ ఉప రాష్ట్రపతి (Vice-President) జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఉదయం నుంచి ఎగువసభను సజావుగా నడిపించిన ఆయన రాత్రికి తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ముర్ముకు పంపారు. దీంతో ఆయన రాజీనామాపై ప్రస్తుతం తీవ్రంగా చర్చ నడుస్తోంది.
పది రోజుల క్రితమే ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధన్ఖర్ ప్రస్తుతం పూర్తికాలం ఉప రాష్ట్రపతి పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు (10 Days Back Veep Said Will Retire At Right Time). జులై 10న జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ‘నేను ఆగస్టు 2027లో సరైన సమయంలో దైవ నిర్ణయానికి లోబడి పదవీ విరమణ చేస్తాను’ అని స్పష్టం చేశారు. ఆయన 2022 ఆగస్టు 11న ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ధన్‌ఖడ్‌కు 2027 ఆగస్టు వరకూ పదవీకాలం ఉంది. అయితే, పది రోజుల క్రితం పూర్తి కాలం ఈ పదవిలో కొనసాగుతానని చెప్పిన ఆయన.. ఇప్పుడు అనూహ్యంగా రాజీనామా చేయడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది.
ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, వైద్యుల సలహాను పాటించడం కోసమే తాను ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని ధన్‌ఖడ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 67(ఏ) అధికరణ కింద ఇది తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం ఈ లేఖను విడుదల చేసింది. తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తి సహకారాన్ని అందచేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మరో రెండేండ్లు పదవీకాలం ఉండగానే ధన్‌ఖడ్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. 2022లో ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ కావడంతో ఆయన బెంగాల్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. విపక్ష అభ్యర్థి మార్గరేట్ అల్వాపై విజయం సాధించి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 710 ఓట్లకుగాను 528 ఓట్లు గెలుచుకుని 1997 తర్వాత అత్యధిక ఓట్లతో ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన మూడో వ్యక్తి ధన్‌ఖడ్. అంతకుముందు 1969లో రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు వీవీ గిరి, 1987లో రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఆర్ వెంకటరామన్ ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. కానీ అలాంటిదేమీ లేకుండానే ధన్‌ఖఢ్ రాజీనామా చేయడం ఢిల్లీ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.
Also Read..
ధన్‌ఖడ్ గుడ్‌బై.. ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా
Next Vice President | ధన్‌ఖడ్ రాజీనామా.. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరంటే?
Gita Gopinath | ఐఎంఎఫ్‌ను నుంచి వైదొలగనున్న గీతా గోపీనాథ్