న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) తన పదవికి రాజీనామా చేశారు. మరో రెండేండ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన కుర్చీని ఖాళీచేశారు. ఆరోగ్య కారణాలను పేర్కొంటూ రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. రాజ్యాంగంలోని 67(ఏ) అధికరణ కింద ఇది తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. ఈనేపథ్యంలో తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే (Next Vice President) అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది. అధికార పార్టీ పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. బీజేపీతోపాటు ఎన్డీయే పక్షాలకు చెందిన నేతనూ ఈ పదవి దక్కనుందని సమాచారం. ఈ నేపథ్యంలో జనతాదళ్ (యునైటెడ్) ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ (Harivansh Narayan Singh) పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది.
బీహార్‌కు చెందిన హరివంశ్‌కు రాజకీయాలలో అనుభవజ్ఞునిగా పేరున్నది. ఉన్నత విద్యావంతుడిగా పేరుపొందరు. ఆయన తొలిసారి 2014లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆర్థికశాస్త్రంలో పీజీ చేసియన ఆయన జర్నలిజ్యంలో డిప్లొమా అందుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు చాలా ఏండ్లు జర్నలిస్టుగా పనిచేశారు. ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం వచ్చినప్పటికీ జర్నలిజంపై మక్కువతో ‘ధర్మయుగ్’లో సబ్ ఎడిటర్‌గా కెరీర్ ప్రారంభించారు. రవివర్, ప్రభాత్ ఖబర్ వంటి ప్రముఖ ప్రింట్ మీడియా సంస్థల్లో పనిచేశారు. ప్రభాత్ ఖబర్‌కు చీఫ్ ఎడిటర్‌గానూ వ్యవహరించారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్‌కు సలహాదారుగా పనిచేసిన ఆయన.. ఆ ప్రభుత్వం కూలిపోవడంతో మళ్లీ జర్నలిజంలోకి వచ్చేశారు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2020 నుంచి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండనుండటంతో హరివంశ్‌నే ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే ప్రభుత్వం నియమించే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, వైద్యుల సలహాను పాటించడం కోసమే పదవి నుంచి తప్పుకుంటున్నానని ధన్‌ఖడ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం ఈ లేఖను విడుదల చేసింది. తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తి సహకారాన్ని అందచేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, మరో రెండేండ్లు పదవీకాలం ఉండగానే ధన్‌ఖడ్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. 2022లో ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ కావడంతో ఆయన బెంగాల్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. విపక్ష అభ్యర్థి మార్గరేట్ అల్వాపై విజయం సాధించి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 710 ఓట్లకుగాను 528 ఓట్లు గెలుచుకుని 1997 తర్వాత అత్యధిక ఓట్లతో ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన మూడో వ్యక్తి ధన్‌ఖడ్. అంతకుముందు 1969లో రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు వీవీ గిరి, 1987లో రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఆర్ వెంకటరామన్ ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. కానీ అలాంటిదేమీ లేకుండానే ధన్‌ఖఢ్ రాజీనామా చేయడం ఢిల్లీ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.
రైతు బిడ్డగా పేరుగాంచిన ధన్‌ఖఢ్ రైతు సమస్యల విషయంలో మోదీ ప్రభుత్వ తీరును పలుసార్లు తప్పుపట్టారు. అంతర్జాతీయంగా భారత్ వెలిగిపోతుంటే మరి దేశంలో రైతులు ఎందుకు సంక్షోభంలో ఉన్నారని ఆయన ఓ సందర్భంలో కేంద్రాన్ని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని కూడా మోదీ సర్కారును ఆయన బహిరంగంగానే నిలదీశారు. సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన ధన్‌ఖఢ్ 1951 మే 18న రాజస్థాన్‌లోని జుంజ్జునూ జిల్లాలోని కిథానా గ్రామంలో జన్మించారు.
గతంలో కాంగ్రెస్, జనతాదళ్‌లో ఉన్న ధన్‌ఖఢ్ 2003లో బీజేపీలో చేరారు. ఉపరాష్ట్రపతిగా ఆయన ప్రతిపక్ష పార్టీలతో తీవ్రంగా విభేదించారు. 2019 నుంచి 2022 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేసిన ధన్‌ఖఢ్ మమతా బెనర్జీ ప్రభుత్వంతో పూర్తి స్థాయిలో ఘర్షణ వాతావరణాన్ని ఎదుర్కొన్నారు. తరచూ ప్రభుత్వంతో విభేదాలతో వార్తల్లో నిలిచారు. ధన్‌ఖఢ్ వైఖరిని మమతాబెనర్జీ తీవ్రంగా ఆక్షేపించారు.