బీజేపీలో అనూహ్య సంచలనం చోటుచేసుకున్నది. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల రీత్యా పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ఆయన ప్రకటించారు. 2022 జూలై నుంచి ఉప రాష్ట్రపతి పదవిలో కొనసాగుతున్న 74 సంవత్సరాల ధన్‌ఖడ్.. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజైన సోమవారం రాజ్యసభ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన అనంతరం తన రాజీనామాను ప్రకటించారు.
న్యూఢిల్లీ, జూలై 21: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, వైద్యుల సలహాను పాటించడం కోసమే తాను ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని ధన్‌ఖడ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 67(ఏ) అధికరణ కింద ఇది తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం ఈ లేఖను విడుదల చేసింది. తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తి సహకారాన్ని అందచేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, మరో రెండేండ్లు పదవీకాలం ఉండగానే ధన్‌ఖడ్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. 2022లో ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ కావడంతో ఆయన బెంగాల్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. విపక్ష అభ్యర్థి మార్గరేట్ అల్వాపై విజయం సాధించి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 710 ఓట్లకుగాను 528 ఓట్లు గెలుచుకుని 1997 తర్వాత అత్యధిక ఓట్లతో ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన మూడో వ్యక్తి ధన్‌ఖడ్. అంతకుముందు 1969లో రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు వీవీ గిరి, 1987లో రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఆర్ వెంకటరామన్ ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. కానీ అలాంటిదేమీ లేకుండానే ధన్‌ఖఢ్ రాజీనామా చేయడం ఢిల్లీ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.
రైతు బిడ్డగా పేరుగాంచిన ధన్‌ఖఢ్ రైతు సమస్యల విషయంలో మోదీ ప్రభుత్వ తీరును పలుసార్లు తప్పుపట్టారు. అంతర్జాతీయంగా భారత్ వెలిగిపోతుంటే మరి దేశంలో రైతులు ఎందుకు సంక్షోభంలో ఉన్నారని ఆయన ఓ సందర్భంలో కేంద్రాన్ని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని కూడా మోదీ సర్కారును ఆయన బహిరంగంగానే నిలదీశారు. సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన ధన్‌ఖఢ్ 1951 మే 18న రాజస్థాన్‌లోని జుంజ్జునూ జిల్లాలోని కిథానా గ్రామంలో జన్మించారు.
గతంలో కాంగ్రెస్, జనతాదళ్‌లో ఉన్న ధన్‌ఖఢ్ 2003లో బీజేపీలో చేరారు. ఉపరాష్ట్రపతిగా ఆయన ప్రతిపక్ష పార్టీలతో తీవ్రంగా విభేదించారు. 2019 నుంచి 2022 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేసిన ధన్‌ఖఢ్ మమతా బెనర్జీ ప్రభుత్వంతో పూర్తి స్థాయిలో ఘర్షణ వాతావరణాన్ని ఎదుర్కొన్నారు. తరచూ ప్రభుత్వంతో విభేదాలతో వార్తల్లో నిలిచారు. ధన్‌ఖఢ్ వైఖరిని మమతాబెనర్జీ తీవ్రంగా ఆక్షేపించారు.