యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామూనే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనసౌకర్యం కల్పించారు. ఆలయ మండపంలో సుదర్శన హోమం, నిత్య తిరుకల్యాణం జరిపించారు. కొండపైన ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. ఆలయ పుష్కరిణీ చెంత భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి.
యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రతపూజల్లో భక్తులు పాల్గొన్నారు. సత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. శ్రీవారి ఖజానాకు గురువారం రూ. 10,53,897 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
స్వామివారి స్వర్ణతాపడానికి కిలో బంగారం…
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా స్వామివారి విమాన గోపురానికి కిలో బంగారాన్ని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సమర్పించారు. సిద్దిపేట నియోజకవర్గం తరపున అందజేసిన బంగారాన్ని ఆలయ ఈవో ఎన్. గీతకు అందజేశారు. మొదటగా యాదాద్రి స్వామివారిని సతీమణితోపాటు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, 100మంది సిద్దిపేట ప్రజాప్రతినిధులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు మోహనాచార్యులు, ఆలయ అధికారులు మంత్రికి సంప్రదాయ స్వాగతం పలికారు.
అనంతరం బాలాలయంలోకి చేరుకుని సువర్ణపుష్పార్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. బాలాలయ ముఖ మండపంలో మంత్రి దంపతులు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి వేద ఆశీర్వచనం ఇవ్వగా, ఆలయ ఈవో ఎన్. గీత స్వామివారి ప్రసాదం అందజేశారు. అష్టోత్తర పూజల్లో పాల్గొన్న మంత్రి కిలో విలువ గల బంగారు బిస్కెట్లను ఈవోకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మరి కొద్దిరోజుల్లో సిద్దిపేట నియోజకవర్గం తరపున మరో కిలో బంగారాన్ని అందజేస్తామని అన్నారు. స్వర్ణతాపడానికి విరాళాలు వెల్లువలా వస్తున్నాయని అన్నారు. ఇప్పటికే 35 కిలోల బంగారం విరాళంగా రాగా, మరో 45 కిలోల బంగారం ఇచ్చేందుకు దాతలు మందుకువస్తున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదాద్రి ఆలయం మహాద్భుతంగా నిర్మాణం పూర్తయిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, భువనగిరి ఆర్డీవో భూపాల్‌రెడ్డి, జిల్లా కోశాధికారి సురేశ్‌కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటయ్య, జడ్పీటీసీ తోటకూరి అనురాధ, ఆలయ ఏఈవోలు గట్టు శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.