ఆలేరు టౌన్, ఆగస్టు 08 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం శాంతియుతంగా దీక్ష చేస్తున్న సీపీఎం నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం హేయమైన చర్య అని ఆ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యుడు ఎంఏ ఇక్బాల్ అన్నారు. శుక్రవారం ఆలేరు పట్టణ కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జిల్లా కేంద్రంలో దీక్ష చేపడుతున్న సీపీఎం నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో దీక్ష చేయవచ్చు గానీ తమ పార్టీ నాయకులు జిల్లా కేంద్రంలో దీక్ష చేస్తే తప్పా అని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వం పోలీసుల ద్వారా దీక్షను అడ్డుకోవడమంటే బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్లను కేవలం నినాదాలకి పరిమితం చేస్తే భవిష్యత్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. ఈ సమావేశంలో మొరిగాడి రమేశ్, వడ్డేమాన్ బాలరాజు, తాళ్లపల్లి గణేశ్, గనగాని మల్లేశ్, బొబ్బిలి యాదగిరి, చిన్న రాజేశ్, కాసుల నరేశ్ పాల్గొన్నారు.