రాజాపేట, నవంబర్ 18 : తరుగు పేరుతో మిల్లర్లు దోపిడీ చేస్తే సహించేదే లేదని రాజాపేట మండల వ్యవసాయ అధికారి పద్మజ అన్నారు. మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరుగు చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఏఓ మండల కేంద్రంలోని మల్లికార్జున పార్ బాయిల్డ్ రైస్ మిల్ను సందర్శించారు. ఈ సందర్భంగా జాల గ్రామానికి చెందిన కొన్యాల పెద్ద రాంరెడ్డి కొత్తజాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించాడు. 153 బస్తాలకు గాను ధాన్యం నలుపు రంగులో మసకబారినాయని 13 బస్తాలు తరుగు చేస్తామని, అలాగైతేనే ధాన్యం తీసుకుంటామని రైస్ మిల్లర్లు తెలిపారు. రైతు రామ్ రెడ్డి ఏఓ పద్మజకు మొరపెట్టుకోగా వెంటనే రైస్ మిల్లును సందర్శించి, రైతు విక్రయించిన ధాన్యం శాంపిల్ ను పరిశీలించి, ఒక్క గింజ కూడా తరుగు లేకుండా సేకరించాలని మిల్లర్లను ఒప్పించారు. దాంతో రైతు పక్షాన నిలబడిన ఏఓ పద్మజకు జాల గ్రామ రైతుల నుండి ప్రశంసలు వెల్లువెత్తాయి.