‘అగ్రహీరో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమా’.. ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్న వార్త ఇది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇది నిజమేనని తెలుస్తోంది. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికీ.. వంటి సున్నితమైన కథలతో సినిమాలు తీసిన వివేక్ ఆత్రేయలో మాస్ యాంగిల్ కూడా ఉందని ‘సరిపోదా శనివారం’ సినిమా నిరూపించింది. అయితే.. గాడ్ ఆఫ్ మాసెస్‌గా కొనియాడబడే బాలకృష్ణతో సినిమా అంటే ఈ యంగ్ డైరెక్టర్‌కి నిజంగా ఛాలెంజే అనాలి.
మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు వినికిడి. ఇటీవలే బాలకృష్ణకు కథను కూడా వినిపించారట వివేక్ ఆత్రేయ. లార్జర్ దేన్ లైఫ్‌లా సాగే ఈ కథ నిడివి ఎక్కువగా ఉండటంతో రెండు భాగాలుగా చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు ఫిల్మ్‌నగర్ టాక్. ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఈ నెల 5న షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని బాలయ్య భావిస్తున్నారట. ఆ తర్వాత వివేక్ ఆత్రేయ సినిమా ఉంటుందని తెలిసింది.