గూడూరు, మార్చి 1 : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి కస్తూర్బా పాఠశాలలో ఆదివారం ఉదయం ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. విశ్వనీయ సమాచారం మేరకు.. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినుల మధ్య ఓ విషయంలో వాగ్వాదం జరుగడంతో విద్యార్థినిపై మరో విద్యార్థిని చేయిచేసుకుంది. దీంతో సదరు విద్యార్థిని క్షణికావేశంలో తన వద్ద ఉన్న విటమిన్ ట్యాబ్లెట్లు ఎక్కువ మోతాదులో వేసుకొని ఆత్మహత్యకు యత్నించింది .
వెంటనే గమనించిన తోటి విద్యార్థినులు హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా, వారు స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మహబూబాబాద్‌లోని దవాఖానకు తీసుకెళ్లారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలిసింది. ఈ పాఠశాలపై అధికారుల నియంత్రణ కొరవడినట్టు పలువురు ఆరోపిస్తున్నారు. కొత్తగా వచ్చిన కలెక్టర్ ఈ పాఠశాలను నిరంతరం తనిఖీ చేస్తూ విద్యార్థినులకు ధైర్యం చెప్పాలని పలువురు కోరుతున్నారు.