రాజాపేట, ఏప్రిల్ 16 : రాజాపేట మండలం చల్లూరు గ్రామంలోని 322 సర్వే నెంబర్ క్రషర్ వ్యవహారంలో చర్చకు సిద్ధమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చేసిన సవాల్ ను స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివాదాస్పదంగా మారిన సదరు క్రషర్ వద్దే ఈ బహిరంగ చర్చ నిర్వహిద్దామని, ఎమ్మెల్యే బిజీ షెడ్యూల్ దృష్ట్యా మీరు తేదీని ఖరారు చేస్తే తాము రావడానికి సిద్ధమని ప్రకటించారు. జిల్లా కలెక్టర్, మైనింగ్ అధికారులు, మేధావులు, అన్ని రాజకీయ పార్టీల నేతలు, జర్నలిస్టుల సాక్షిగా ఈ చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
చల్లూరులో రాత్రింబవళ్లు అక్రమంగా బ్లాస్టింగ్లు జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారో అధికారులు సమాధానం చెప్పాలన్నారు. అక్రమాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా పేరుతో కేసులు పెడతామని బెదిరించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, తక్షణమే సదరు క్రషర్ కార్యకలాపాలను నిలిపివేయించి విచారణ జరిపించడం ద్వారా ఎమ్మెల్యే తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.