బీబీనగర్, అక్టోబర్ 06 : స్థానిక సంస్ధల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం బీబీనగర్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి అభ్యర్థుల ఎంపికపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టబద్దతో కల్పించాలన్నారు. చట్టబద్దత లేకుండా ఎన్నికలకు వెళ్లినా అది నిలబడదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెబుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక అమలు చేయడం విస్మరించారన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
రైతులకు యూరియా అందక గ్రామాల్లో అనేక అవస్థలు పడ్డారని, నిద్రాహారాలు మాని షాపుల ఎదుట క్యూలైన్లలో నిలబడ్డా ఫలితం దక్కలేదన్నారు. గ్రామాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించుకుని అభ్యర్థుల ఎంపిక, గ్రామాభివృద్ధిపై చర్చించుకోవాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ సందీప్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్, రైతు బంధు సమితి మాజీ కో ఆర్డినేటర్ బొక్క జైపాల్‌రెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అద్యక్షుడు మల్లగారి శ్రీనివాస్, నాయకులు పిట్టల అశోక్, చెంగలి కిషన్‌రావు, ఆకుల ప్రభాకర్, కొంతం లింగెయ్యగౌడ్, మండల ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్‌రెడ్డి, పట్టణ అద్యక్షుడు గోలి సంతోష్‌రెడ్డి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Bibinagar : స్థానిక సంస్ధల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలి : మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి