కేతేపల్లి, జూలై 18 : రాష్ట్రంలో ఉన్న రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మూసీ ప్రాజెక్ట్ కుడి కాల్వకు శుక్రవారం ఆయన నీటిని విడుదల చేసి మాట్లాడారు. రైతులు వరి నాట్లు వేసేందుకు అనుకూలంగా ప్రాజెక్ట్ కాల్వలకు నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. చివరి ఆయకట్టుకు నీరు అందేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నకిరేకల్, కేతేపల్లి మండలాల్లో సాగునీరు అందని గ్రామాలకు కూడా నీరు అందేలా చూస్తామన్నారు.
ప్రాజెక్ట్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులు కూడా నీటిని వృథా చేయకుండా అవసరమైన మేర నీటిని వాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ బోళ్ల వెంకట్‌రెడ్డి, డీఈఈ చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు కె.శ్రీనివాస్‌యాదవ్, నాయకులు బొజ్జ సుందర్, ఎం.వెంకట్రాంరెడ్డి, కె.మల్లికార్జున్‌రావు, పి.శేఖర్, పి.ఇందిర, కె.మల్లేశ్, కె.వీరన్న, పి.గోవర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.