భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 12: హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి మూసీ (Musi River) పరవళ్లు తొక్కుతున్నది. దీంతో యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలంలోని జూలూరు-రుద్రవెళ్లి వద్ద లో లెవెల్ బ్రిడ్జి పైనుంచి మూసి ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అప్రమత్తమైన పోలీసులు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూసీ పొంగడంతో విద్యార్థులు బడికి గైరాజరయ్యారు.
రాకపోకలు నిలిచిపోవడంతో బీబీనగర్ ఎయిమ్స్కి వెళ్లే రోగులకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మండల ప్రజలు బీబీనగర్, భోనగిరి వెళ్లేందుకు పెద్ద రావులపల్లి నుంచి చుట్టూ తిరిగి వెళ్తున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి నిలిచిపోయిన హై లెవెల్ బ్రిడ్జి పనులను పూర్తి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై నాగిరెడ్డిపల్లి లోలెవల్ వంతెనపై వరద కాలువ ఉధృతంగా ప్రవహిస్తున్నది. తొలుత వాహనాలను అనుమతించినా ప్రవాహ వేగం పెరగటంతో ఇరువైపులా పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టారు. రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో వాహనాలు బారులు తీరాయి.