రాజాపేట, ఫిబ్రవరి 03 : యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు ప్రాంతాల్లో సంచరించిన పులి జనగామ జిల్లాలోకి ప్రవేశించిందని జిల్లా ఫారెస్ట్ అధికారి సుధాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాజాపేట మండలంలోని బసంతాపురంలో పులి దాడిలో మృతి చెందిన లేగ దూడను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా జిన్నారం నుండి పులి ఈ ప్రాంతానికి వచ్చిందని తెలిపారు. జిల్లా నుండి సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించింది అనుకున్న పులి తిరిగి అనువైన ప్రాంతం కోసం ఈ ప్రాంతానికే వచ్చి పశువులపై దాడి పాల్పడుతుందన్నారు. గంధమల్ల అడవి నుంచి రేణికుంట మీదుగా బసంతాపురంలో లేగ దూడను చంపి, పిట్టలగూడెం మీదుగా లక్ష్మక్కపల్లి నుండి జనగామ జిల్లాలోకి ప్రవేశించిందని తెలిపారు.
పులిని పట్టుకోవడానికి బోన్లు, కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉచ్చులు, విద్యుత్ తీగలు అమర్చితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పులి ఇప్పటికే సుమారు 400 కిలోమీటర్లు సంచరించినట్లు ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. పులి జోలికి పోతే తప్పా ప్రజలపై అది దాడికి పాల్పడే ఆస్కారం లేదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పులిని పట్టుకోడానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట డీఎఫ్ఓ పద్మజ, ఫారెస్ట్ అధికారులు శ్రీను, లక్ష్మణ్, స్వామి, నిఖిత, శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.