Tiger | యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామ శివారులోని ఓ పొలం సమీపంలో లేగదూడపై పులి దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో పరిసర గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
పులి సంచారం నేపథ్యంలో వీరారెడ్డిపల్లి, గంధమల్ల, ఎన్జీ బండల్, కోనాపూర్, ఇబ్రహీంపూర్ గ్రామాల ప్రజలు అంత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అటవీ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇళ్లలో నుంచి బయటకు రావద్దని.. పశువుల మంద, వ్యవసాయ బావుల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని హెచ్చరించారు. పులి సంచారానికి సంబంధించి ఎవరైనా అనుమానాస్పదంగా గమనిస్తే వెంటనే తుర్కపల్లి పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు. ఇందుకోసం 8712662479, 8712662805 నంబర్లకు కాల్ చేసి సమాచారం అందివ్వాలని తుర్కపల్లి ఎస్సై తెలిపారు.