ప్రభుత్వం, మంత్రులు ఇప్పటికీ సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు ఆర్భాట ప్రకటనలు బోగస్ అని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు మొదలై నెలరోజులు దాటినా నేటికీ ఆచరణలో ఎక్కడా ఒక్క క్వింటా సన్న వడ్లకు కూడా బోనస్ ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు గతంలో ఎన్నడూ సన్నవడ్లు వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఇక్కడికి సన్నవడ్లను తెస్తేనే బోనస్ అని మెలిక పెట్టడంలోనే ప్రభుత్వ ఉద్దేశమేంటో స్పష్టం అవుతున్నది. దీంతో ఇప్పటికే నల్లగొండ జిల్లాలో రైస్‌మిల్లర్లు కొనుగోలు చేసిన సన్నవడ్లు 2.83లక్షల మెట్రిక్ టన్నుల్లో ఒక్క టన్ను వడ్లకు కూడా బోనస్ వర్తించలేదు. కేవలం రైతులు మద్దతు ధరకు అటు ఇటుగా మిల్లర్లు చెప్పిన ధరకే సన్నాలను విక్రయించి మిన్నకుంటున్నారు. నిజంగా ప్రభుత్వానికి సన్నాలకు బోనస్ ఇవ్వాలన్న చిత్తశుద్ధి ఉంటే రైస్‌మిల్లర్లకు అమ్మిన ధాన్యానికి బోనస్ ఇవ్వాలని రైతుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే బుధవారం నల్లగొండ కలెక్టరేట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన సమీక్షలో సన్నాలు, వాటి బోనస్‌పై ఎలాంటి చర్చ జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వ నిబంధనల వల్ల ఇప్పటికే విక్రయించిన సన్నాలకు రూ.140 కోట్ల వరకు బోనస్‌కు ప్రభుత్వం ఎగనామం పెట్టినట్లే.
ఉమ్మడి జిల్లాలో పండించిన సన్నవడ్లల్లో మెజార్టీ భాగం మిర్యాలగూడ ప్రాంతంలోని రైస్‌మిల్లులకే తరలివస్తుంటాయి. సన్నాలను ఆరబెట్టడం, ప్రభుత్వం నిర్దేశించిన తేమ శాతం రావడం, దుమ్ముదూళి లాంటి వాటి తొలగించడంలో ఉన్న సమస్యల నేపథ్యంలో నేరుగా రైస్‌మిల్లర్లకే విక్రయించడం ఆనవాయితీ. ప్రస్తుత వానకాలం సీజన్లోనూ రైతులంతా మిర్యాలగూడ ప్రాంత మిల్లులకే బారులు తీరారు. దాదాపు నెల రోజులుగా నాన్‌ఆయకట్టు నుంచి సన్నాలు రాగా, ప్రస్తుతం సాగర్ ఆయకట్టు నుంచి రాక మొదలైంది. ఇలా ఇప్పటికే జిల్లాలోని రైస్‌మిల్లర్లు 2.83లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలను కొనుగోలు చేసినట్లు రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ వెల్లడించారు. ప్రతిరోజూ 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఆయకట్టులో వరికోతలు ముమ్మురం అయితే మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన సన్నాలకు మద్దతు ధరకు అటు ఇటుగానే రైతులకు ధర లభించింది. కానీ ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్ మాత్రం వర్తించడం లేదు.
సన్నాలకు సున్నా బోనస్
ప్రభుత్వం ఈ సారి సన్నాల కొనుగోలు కోసమే 80 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. కానీ నేటికీ ఒక్క క్వింటా కూడా ఈ కేంద్రాలకు సన్నవడ్లు రాలేదని అధికారులే చెప్తున్నారు. సాగర్ ఆయకట్టులో కోతలు షురూ అయితే రావచ్చని భావిస్తున్నారు. కానీ ఆచరణలో సన్నవడ్లు కేంద్రాలకు రావడం దాదాపు శూన్యమనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఎన్నడూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు సన్నాలు వచ్చిన దాఖలాలు లేవు. ఈ నేపధ్యంలో ప్రస్తుత నిబంధనల ప్రకారం సన్నవడ్లకు సైతం ఒక్క పైసా బోనస్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ సన్నాల రైతులు ఇప్పటికే నేరుగా రైస్‌మిల్లర్లకు 2.83లక్షల మెట్రిక్ టన్నుల సన్నవడ్లను విక్రయించారు. కానీ ఇందులో ఒక్క టన్నుకు కూడా బోనస్ వర్తించలేదు. ఎందుకంటే ప్రైవేటుగా విక్రయిస్తే బోనస్ లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది. వాస్తవంగా రైతులు ఇప్పటికే విక్రయించిన సన్నాలకు బోనస్‌ను వర్తింపచేస్తే రైతులకు రూ.140 కోట్ల వరకు డబ్బులు అదనంగా వచ్చేవి. కానీ అలాంటి పరిస్థితులు కనిపిస్తలేదు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధాన్యంపై జరిపిన సమీక్షలోనూ సన్నాల బోనస్ ఎక్కడా చర్చ రాకపోవడంతో ప్రభుత్వం ఎగ్గొట్టడానికే సిద్ధంగా ఉన్నట్లు రైతులు భావిస్తున్నారు. రైతులు మాత్రం రైస్‌మిల్లులకు విక్రయించిన సన్నవడ్లకు సైతం బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుండడం విశేషం. ప్రభుత్వానికి నిజంగా బోనస్ ఇవ్వాలన్న చిత్తశుద్ధి ఉంటే రైతు ఎక్కడ అమ్ముకున్నా ఇవ్వాలని కోరుతున్నారు.
దొడ్డు వడ్లకు చెల్లించింది రూ.52 కోట్లే..
మరోవైపు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా జరుగుతున్న కొనుగోళ్లల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతుంది. ముఖ్యంగా ధాన్యం డబ్బుల చెల్లింపులో ఆలస్యం అవుతున్నది. సివిల్ సైప్లె అధికారుల లెక్కల ప్రకారం నల్లగొండ జిల్లాలో 340 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నారు. మంగళవారం నాటికి జిల్లాలో 69వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. దీని విలువ రూ.160.92 కోట్లుగా ప్రకటించారు. అయితే ఇందులో రైతులకు చెల్లించిన డబ్బులు మాత్రం రూ.52కోట్లే కావడం గమనార్హం. గతంలో మూడునాలుగు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాగా ప్రస్తుతం వారం నుంచి 15 రోజుల వరకు సమయం పడుతున్నది. ట్యాబ్ ఎంట్రీలు ఆలస్యం కావడం, ట్రక్షీట్లను పూర్తి చేయకపోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిసింది. ఇదే విషయమై బుధవారం మంత్రి కోమటిరెడ్డి సమీక్షిస్తూ దీనిపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసిందే. డబ్బుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యాన్ని గుర్తించి మరో రెండు రోజుల్లోనే ఇంకో రూ.50కోట్ల డబ్బులు చెల్లించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.