యాదగిరిగుట్ట, ఆగస్టు 21 : పదేళ్ల కాలంలో దర్జాగా కాలరేగరేసి ఎవుసం చేసిన రైతులు ఇప్పుడు చేతగాని రేవంత్‌రెడ్డి పాలనలో యూరియా కోసం అధికారుల కాళ్లు పట్టుకునే దుస్ధితికి వచ్చినట్లు ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందరెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో ఆరు నెలల ముందే బఫర్ స్టాక్ తెప్పిస్తే, సీజన్ మొదలై ఆరు నెలలు కావస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొద్దు నిద్ర నుంచి లేవలేదని మండిపడ్డారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలో మీడియాతో ఆమె ఆమె మాట్లాడారు. వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే యూరియా అవసరాన్ని అంచనా వేసి, నిల్వలను సిద్ధం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతులకు అవసరమైన యూరియా, ఎరువులపై సీఎం ఏ ఒక్కరోజు సమీక్షా సమావేశం నిర్వహించలేదన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని పరమావధిగా భావిస్తున్న రేవంత్‌రెడ్డికి రైతుల సమస్యలు తీర్చాలన్న సోయిలేదన్నారు. రాష్ట్రానికి అవసరమైన యూరియా కోటాను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే ఇండెంట్‌ను సకాలంలో అందించడంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. ఊరూరా రైతులు క్యూలైన్లలో చెప్పులు, ఆధార్ కార్డులు పెట్టి వర్షంలో తడుస్తుంటే.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఢిల్లీ బాసుల సేవలో తరిస్తున్నాడని విమర్శించారు. మొన్నటి దాకా విత్తనాల కొరత, సాగునీటి సంక్షోభం, కరెంట్ కోతలు, ఇప్పుడు ఎరువుల కొరత దాపురించిందన్నారు. సన్నాసి రేవంత్ పాలనపై రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని, ఇవాళ్ల రాష్ట్రంలో రేవంత్‌ను తిట్టని రైతు, శాపనార్ధాలు పెట్టని మహిళా రైతులు లేరన్నారు.
ప్రైవేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు వారి నుంచి భారీగా ముడుపులు తీసుకుని యూరియా స్కామ్ చేస్తున్నారన్న అనుమానం కలుగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బురదజల్లడంలో పెట్టిన సమయం, ఎరువులు తెప్పించడంలో పెట్టి ఉంటే ఇవాళ రైతులకు ఇంత దుస్ధితి వచ్చేది కాదన్నారు. యూరియా కొరతలో కాంగ్రెస్, బీజేపీ దొందు దొందేనన్నారు. కేంద్రం నుంచి యూరియా కరెక్ట్ గానే వస్తుందని, రాష్ట్రానికి వచ్చాక ఏమవుతుందో అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు చెప్పడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. జూబ్లిహిల్స్ ఫ్యాలెస్‌లో మొద్దునిద్ర పోతున్న సీఎం ఏ మాత్రం సిగ్గుశరం ఉన్నా గ్రామాల్లో పర్యటించాలన్నారు. అన్నదాతల వెంట బీఆర్ఎస్ సైన్యం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, నార్మూల్ మాజీ డైరక్టర్ ఒగ్గు భిక్షపతి, నాయకులు అవుల సాయి, గంగసాని నవీన్, పాండవుల భాస్కర్, బండ బాలసిద్దులు పాల్గొన్నారు.