బీబీనగర్, సెప్టెంబర్ 22 : వర్షంలో సైతం విద్యుత్ అధికారులు కష్టపడి పని చేశారు. విద్యుత్ సరఫరాలో రైతులకు ఇబ్బంది లేకుండా చెరువులో తెగిపడిన విద్యుత్ వైర్లను ఈదుకుంటూ వెళ్లి పునరుద్ధరించారు. బీబీ నగర్ పట్టణ కేంద్రంలోని సబ్ స్టేషన్ నుండి మండలంలోని కొండమడుగు గ్రామానికి 11 కెవి ఏజిఎల్ విద్యుత్ లైన్ ద్వారా విద్యుత్ ను సరఫరా చేస్తున్నారు. ఈ లైన్ స్తంభం చెరువులో ఉండగా చెరువు కట్టపై ఉన్న భారీ చెట్టు స్తంభంపై కూలడంతో వైర్లు తెగి చెరువులో పడ్డాయి. దీంతో అప్రమత్తమైన విద్యుత్ అధికారులు నీళ్లలో ఈదుకుంటూ వెళ్లి స్తంభంపై పడిన చెట్టును తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. వర్షం కురుస్తున్నప్పటికీ అధికారులు వెంటనే విద్యుత్ మరమ్మతులు చేపట్టి పునరుద్ధరించడాన్ని పలువురు అధికారులు, గ్రామస్తులు అభినందించారు. ఏఈ మనోహర్ రెడ్డి, లైన్ మెన్ శ్రీనివాస్, ఏఎల్ఎం ఇమామ్, అంజాద్ కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
Bibinagar : వర్షంలోనూ చెరువులో ఈదుకుంటూ వెళ్లి విద్యుత్ పునరుద్ధరణ