– చిమ్నా తండా చోరీ కేసులో ట్విస్ట్
కారేపల్లి, ఫిబ్రవరి 27 : కారేపల్లి మండలంలోని చిమ్నా తండాలో బుధవారం చోరీ జరిగింది. గురువారం రాత్రి దొంగిలించిన సొత్తులో కొంత ఇంటి ముందు ప్రత్యక్షమైంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత కమలాపురం పంచాయతీ పరిధిలోని తండాకు చెందిన గుగులోత్ వీరు అనారోగ్యంగా ఉండడంతో భార్యతో కలిసి ఖమ్మం ఆస్పత్రికి వెళ్లారు. కుమారుడు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యాడు. పరీక్షకు వెళ్లిన కొడుకు వస్తాడని ఇంటి తాళంచెవి బయట సీక్రెట్ ప్లేస్ లో పెట్టి వెళ్లారు. ఇంట్లోకి చొరబడ్డ దొంగలు తాళం తీసి సొత్తును ఎత్తుకెళ్లి అనుమానం రాకుండా తాళంచెవిని అదే చోట పెట్టి వెళ్లారు. రాత్రి ఇంటికి వచ్చిన వీరు బీరువా తీసి చూడగా అందులో ఉన్న నగదు, బంగారం చోరీకి గురైంది. తులం చెవి దిద్దులు, మూడు తులాల బంగారు గొలుసు, 30 తులాల వెండి, లక్షల నగదు దొంగలు ఎత్తుకెళ్లారని బాధితుడు కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ గోపి కేసు నమోదు చేసి గురువారం రాత్రి క్లూస్ టీం తో సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ ప్రారంభించారు. పోలీసులు వెళ్లిన తర్వాత అర్ధరాత్రి వేళ ఓ కవర్లో తులం బంగారు చెవి దిద్దులు, 30 తులాల వెండి, పదివేల నగదు కవర్లో పెట్టి దొంగలు వదిలి వెళ్లారు. పోయిన బంగారంలో మరో మూడు తులాల బంగారు గొలుసు, నగదు రికవరీ కావాల్సి ఉందని ఎస్ఐ తెలిపారు.