రామన్నపేట, నవంబర్10 : రైస్ మిల్లర్ల దోపిడిని అరికట్టి రైతులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ రామన్నపేట మండలాధ్యక్షుడు పోశబోయిన మల్లేశం అన్నారు. సోమవారం జనంపల్లి గ్రామంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మునిపంపుల గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో ఆదివారం ధాన్యం కొనుగోలు చేసి వారికి కేటాయించిన వలిగొండ మండలంలోని వాసవి రైస్ మిల్లుకు తరలించారన్నారు. ధాన్యం నాణ్యత లేవని రైస్ మిల్లు యాజమాన్యం రెండు లారీల లోడ్ ధాన్యంను దిగుమతి చేసుకోలేదన్నారు. మండల వ్యవసాయ అధికారులు రైస్ మిల్లు వద్దకు వెళ్లి ధాన్యంను దిగుమతి చేసుకోవాలని కోరినా ధాన్యంలో తాలు ఉన్నాయని ఖరాఖండిగా చెప్పి తిరస్కరించారు. దీంతో రైతులు రైస్ మిల్లర్‌ను బతిమిలాడి ప్రాధేయపడితే ఒక్కోలారీకి 10 క్వింటాలు చొప్పున కటింగ్ చేసి దిగుమతి చేసుకోవడం జరిగిందన్నారు.
సోమవారం వెళ్లిన ధాన్యం లారీ లోడ్లకు కూడా ఇదే కారణం చూపి ఆపివేయడం జరిగిందని, దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్, సంబధిత అధికారులు స్పదించి వాసవి రైస్ మిల్లు యాజమాన్యంపై చట్టరీత్య చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన రైతులతో రైస్ మిల్లును మట్టడించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు బండ రంగారెడ్డి, ఏసబోయిన భిక్షం, కోసాని అంజయ్య, నక్క సత్తయ్య, నల్ల సైదులు, కైరంకొండ గోవర్ధన్, అక్కెనపల్లి మల్లయ్య, వంగాల సంపత్, గట్టు శేఖర్, వెంకన్న, సాయి, నరేశ్, బన్నీ పాల్గొన్నారు.