యాదగిరిగుట్ట, అక్టోబర్ 08 : రెండున్నరేళ్ల రేవంత్‌రెడ్డి సర్కార్ పాలనపై విసుగుచెందిన ప్రజానీకం కేసీఆర్ వెంటే ఉంటామని బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని బొందపెట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తుర్కపల్లి మండలం దయ్యంబండ తండా గ్రామ పరిధిలోని మంచిరోని మామిళ్లకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, గౌడ సంఘం అధ్యక్షుడు తాటికొండ రాజుగౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వకుడోత్ రవినాయక్, కాంగ్రెస్ నాయకులు తుమ్మల యాదిరెడ్డి, బాసిరెడ్డి తిరుపతిరెడ్డి, ఆదర్శ రెడ్డి, సతీశ్‌రెడ్డి, అంజిరెడ్డి, అజిత్ గౌడ్, నర్సయ్య గౌడ్, చంద్రయ్య గౌడ్, భాస్కర్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, మహిపాల్‌రెడ్డి, రాంరెడ్డి, సందీప్, సాయివర్ధన్‌రెడ్డి, బాల్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బానుగౌడ్, దేవేందర్ గౌడ్, బబ్లూ నాయక్ తండాకు చెందిన బీజేపీ మాజీ సర్పంచ్ మాడొత్ రమేశ్ నాయక్ తో పాటు సుమారు 200 మంది కాంగ్రెస్, బీజేపీ కి రాజీనామా చేసి బుధవారం యాదగిరిగుట్టలో గొంగిడి మహేందర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. రేవంత్‌రెడ్డి పాలన రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, నాణ్యమైన విద్యుత్ సరఫరా కావడం లేదని మండిపడ్డారు. 22 నెలల పాలనలో ఆయన చేసింది శూన్యమన్నారు. సకాలంలో యూరియా అందక ఎంతో మంది రైతులు నరకం అనుభవిస్తున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన్నట్టే ఇచ్చి వారికి బిల్లులు రాక ఇళ్లు కట్టలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నట్లు తెలిపారు. గ్రామాలలో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. రైతుల పక్షపాతిగా పదేళ్ల కేసీఆర్ పాలన సాగిందని ప్రజలు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కారు గుర్తుకు ఓటేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు.
అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు సమకూర్చడంలో ఇక్కడి ఎమ్మెల్యే ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును ఇంటింటికీ పంపిణీ చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ సునామీ రాబోతుందని, ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టబోతున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, బీఆర్ఎస్ తుర్కపల్లి మండల అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్వీ నియోజకవర్గ కన్వీనర్ ర్యాకల రమేశ్ యాదవ్ పాల్గొన్నారు.