– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మాడుగుల ప్రభాకర్ రెడ్డి
భూదాన్ పోచంపల్లి, మే 29 : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భూదాన్ పోచంపల్లిలో పార్టీ మండల, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నేతాజీ ప్రధాన చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. రోడ్డుపై ధాన్యం పోసి నాయకులు, రైతులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నాయకులు దోచుకోవడం, దాచుకోవడం తప్ప రైతులు, ప్రజలకు మేలు చేయడం లేదన్నారు. మళ్లీ 50 ఏండ్ల దాకా కాంగ్రెస్ పార్టీని 100 కిలోమీటర్ల లోతులో పాతి పెడతారని విమర్శించారు. ప్రజా పాలన అంటే ధాన్యo కొనకుండా రైతులను గోస పెట్టడమేనా అని ప్రశ్నించారు. ధాన్యం అమ్ముకోవాలంటే రైతులు కల్లాల వద్ద పడి కాపులు కాస్తున్నారని, అకాల వర్షాలతో ధాన్యం తడిచే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం దిగుమతి చేసుకునేందుకు స్థలం లేకపోవడం, ధాన్యం లారీలు లోడింగ్ అన్లోడింగ్ ప్రక్రియ జాప్యం జరుగుతుందన్నారు. అధికారులు నాయకులు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పర్యటించి రైతుల కష్టసుఖాలను తెలుసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు అష్ట కష్టాలు పడుతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదంటూ మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రోటోకాల్ పాటించడం లేదని, ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులు, అధికారులచే ప్రారంభం చేయాలని సూచించారు. ప్రజలను ఓట్లు వేయమని అడిగితే కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా గెలవరని, వారి బండారం బయట పడుతుందని ఎద్దేవా చేశారు. రైస్ మిల్లులో మూడు పంటలకు సంబంధించిన ధాన్యం ఉందని, ఎఫ్సీఐ వారు ధాన్య o కొంటె గోడౌన్లు ఖాళీ అవుతుందన్నారు. జూన్ 8 తేది లోపు ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సీత వెంకటేష్, మాజీ వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్ రెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్ రావుల శేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు ముత్యాల మైపాల్ రెడ్డి, పగిల సుధాకర్ రెడ్డి, నోముల మాధవరెడ్డి, ఐతరాజు భిక్షపతి, సిపిఎం మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, నాయకులు సామ రవీందర్ రెడ్డి, బత్తుల శ్రీశైలం గౌడ్, పర్నె మల్లారెడ్డి, పగిళ్ల రామ్ రెడ్డి, బండి కృష్ణ, మన్నె పద్మా రెడ్డి, ఫకీరు సుధాకర్ రెడ్డి, యాకరి నర్సింగ్ రావు, చిలువేరు బాలనరసింహ, గునిగంటి మల్లేష్ గౌడ్, గుండు మధు, కర్నాటి మధు, సీత శ్రవణ్, చింతకింది కిరణ్, కర్నాటి అంజమ్మ, గుండు రాజమణి, పార్టీ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు.

‘రైతుల పాలిట శాపంగా మారిన రేవంత్ ప్రభుత్వం’