ఆలేరు టౌన్, జూలై 18 : ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేసేది పీఆర్టీయూ ఒక్కటేనని ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆలేరులో ఉపాధ్యాయ ఆర్థిక సహకార పరపతి సంఘం ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని కాపాడింది పీఆర్టీయూ అన్నారు. సీపీఎస్ రద్దుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, సర్వీస్ రూల్స్ మార్పునకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డులు అందుతాయని చెప్పారు.
సమస్యల సాధన కోసం ప్రభుత్వంతో పోరాటానికి కూడా సిద్ధమన్నారు. అనంతరం పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నగదు పురస్కారాలతో సన్మానించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అమరేందర్ రెడ్డి, మధుసూదన్, మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు జోసెఫ్, దశమంతరెడ్డి, మండలాల నాయకులు పాల్గొన్నారు.