మోత్కూరు, అక్టోబర్ 09 : మోత్కూరు మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మండలంలో 5 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీలకు ఇద్దరు ఆర్వోలు, జడ్పీటీసీకి ఒక ఆర్వోను నియమించారు. పోటీ చేసే అభ్యర్థులు ఎంపీడీఓ ఆఫీస్ కు వచ్చి నామినేషన్ పత్రాలు తీసుకెళ్తున్నారు. మోత్కూరు జడ్పీటీసీ స్థానం ఎస్సీ జనరల్‌గా రిజర్వ్ కాగా, ఎంపీపీ స్థానం కూడా ఎస్సీ జనరల్‌కే రిజర్వ్ అయ్యింది.
మండలంలో 5 ఎంపీటీసీ స్థానాలు ఉండగా పొడిచేడు ఎంపీటీసీ ఎస్సీ జనరల్, దాచారం బీసీ మహిళ, దత్తప్పగూడెం జనరల్, ముశిపట్ల జనరల్, పాటిమట్ల బీసీ జనరల్‌గా రిజర్వ్ అయ్యాయి. మండలంలో 10 గ్రామాల్లో 13,215 మంది ఓటర్లు ఉండగా 6,528 మంది పురుషులు, 6,687 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. దత్తప్పగూడెం, ముశిపట్ల ఎంపీటీసీల స్థానాల ఆర్వోగా మిర్యాల దామోదర్, దాచారం, పొడిచేడు, పాటిమట్ల ఎంపీటీసీల ఆర్వోగా బి.సత్యనారాయణ, జడ్పీటీసీ ఆర్వోగా అడిషనల్ డీఆర్డీఏ జి.సురేశ్ వ్యవహరించనున్నారు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ ప్రధాన పార్టీలు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు.