సూర్యాపేట, అక్టోబర్ 09 : అధికారంలోకి వచ్చి 22 నెలలు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను నిలువునా మోసం చేసిందని సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 9వ వార్డులో కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రజలకు పంపిణీ చేసి మాట్లాడారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు కోల్పోయిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క రంగం కూడా సరిగ్గా లేదన్నారు. రైతులు పంట వేస్తే యూరియా ఇచ్చే నాథుడు లేడని, కష్టనష్టాలకు ఓర్చి పండిస్తే కొనే దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి ఇవ్వక మహిళలకు బాకీ పడ్డారని, విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా బాకీ పడ్డారని, ఆటో కార్మికులకు ఆర్థిక చేయూత ఇవ్వకుండా బాకీ పడ్డారని, రైతులకు రుణమాఫీ చేయకుండా బాకీ పడ్డారని, విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వకుండా బాకీ పడ్డారని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి హామీలో ప్రజలకు బాకీ పడిందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు బాకీ పడ్డ ప్రతి హామీని అమలు చేయాలని, అప్పుడే ఓటు అడిగేందుకు ప్రజల వద్దకు రావాలన్నారు. ఓటు అడిగేందుకు వచ్చే కాంగ్రెస్ నాయకులకు బాకీ కార్డు చూపించి నిలదీయాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు.
Suryapet : హామీలు అమలు చేయని ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించాలి : పెరుమళ్ల అన్నపూర్ణ