హనుమకొండ, అక్టోబర్ 9 : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాలలో చదువుతున్న డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు పెంచిన మొదటి సెమిస్టర్ ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కేయూ పరిపాలన భవనం ఎదుట బైఠాయించి వర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే పెంచిన ఫీజును తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్, డీఎస్ఏ జిల్లా కన్వీనర్ ఉప్పుల శివ మాట్లాడుతూ ఇటీవల కేయూ విడుదల చేసిన మొదటి సెమిస్టర్ ఫీజు ప్రకటనలో భారీగా మార్పులు జరిగాయన్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులు రైతు కూలీలని అధిక ఫీజులు వారు కట్టలేరని ఈ ఫీజు పెంపు మీకు తగదని ఇంతకుముందుకు రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో రూ.80 ఇప్పుడు ఏకంగా ఫీజుని రూ.1200 వందలకు పెంచడం సిగ్గుచేటన్నారు. వివిధ రకాల పేర్లతో మొత్తం ఫీజు విద్యార్థులు కట్టాల్సింది రూ.1340 అయితే రూ.3,250 పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే పెంచిన ఫీజులు మొత్తము తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనియెడల వేలాదిమంది విద్యార్థులతో యూనివర్సిటీ ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. అనంతరం రిజిస్ట్రార్ వల్లూరి రాంచంద్రంకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు అంకిత, పావని, డీఎస్ఏ జిల్లా నాయకులు సంజయ్, శశిధర్, డిగ్రీ విద్యార్థులు పాల్గొన్నారు.