ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకున్న యాదాద్రి ఆలయంలో పంచనారసింహుడి వైభవాన్ని చూసేందుకు ఇన్నాళ్లు ఎదురు చూసిన భక్తులు స్వామివారి సన్నిధికి పోటెత్తుతున్నారు. సోమవారం అత్యంత వైభవోపేతంగా ఆలయ పునరావిష్కారం జరగ్గా, రెండోరోజు మంగళవారం శ్రీవారి దర్శనానికి క్యూ కట్టారు. రాష్ట్ర నలుమూలల నుంచి యాదాద్రికి వచ్చిన భక్తులు తెరలు తెరలుగా పరచుకున్న ఆకుపచ్చందాలను చూసుకుంటూ యాదాద్రి దర్శిని ప్రత్యేక బస్సుల్లో కొండపైకి చేరుకున్నారు. కృష్ణశిలా సౌందర్యాన్ని చూసి అబ్బురపడ్డారు. జయవిజయులు, ఐరావతాల స్వాగతాన్ని స్వీకరిస్తూ మహాలయంలోకి అడుగుపెట్టిన క్షణం బాహ్యప్రపంచాన్ని మరిచి ఇల వైకుంఠాన్ని దర్శించారు. స్వర్ణకాంతులతో ధగధగ మెరిసిపోయే గర్భగుడి మహా ద్వారం నుంచి స్వయంభువులు సాక్షాత్కరించడంతో నమో నారసింహాయ అంటూ భక్తితో ప్రణమిల్లారు. యాదాద్రి ఆలయాన్ని అత్యద్భుతంగా పునర్నిర్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వేనోళ్లా పొగిడారు. సౌకర్యాల కల్పనపై సంతోషం వ్యక్తం చేశారు.
పంచనారసింహుడి దర్శనంతో భక్తులు పులకించిపోతున్నారు. రెండోరోజు మూలవర్యుల దర్శనం కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో క్యూలైన్లలో వెళ్లి దర్శించుకున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా అధికారులు చేసిన ఏర్పాట్లకు మంత్రముగ్ధులయ్యారు. ప్రధానాలయ కట్టడాలు, క్యూలైన్ల తీరు, స్వామివారి దర్శనం చాలా బాగున్నదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్యూ లైన్ల నిర్మాణం, మెట్ల అమరికతోపాటు ప్రసాద విక్రయశాల భవనం మహాద్భుతంగా ఉన్నాయని కితాబునిచ్చారు. కొండకింద సకల వసతులతో కళ్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి నిర్మాణాలు కనువిందు చేస్తున్నట్లు తెలిపారు. కొండగుహలో స్వయంభువులుగా వెలసిన జ్వాలా నరసింహ, లక్ష్మీనరసింహ, యోగానంద, గండ భేరుండ, ఉగ్రనరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు ఆనందంతో పరవశించిపోయారు.
భక్తులతో పులకరించిన పుష్కరిణి..
కొండకింద నిర్మించిన లక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానమాచరించి భక్తులు పులకరించిపోయారు. ‘జై నరసింహ.. జై జై నరసింహ’ అంటూ స్మరించుకుంటూ గుండంలో మూడుసార్లు మునక వేస్తున్నారు. సుమారు 43 మీటర్ల పొడవు, 16.50 మీటర్ల వెడల్పు, 4 ఫీట్ల ఎత్తులో నిర్మించిన గుండంలో 15 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేశారు. ఏకకాలంలో సుమారు 1,500 మంది భక్తులు స్నానమాచరించే విధంగా నిర్మాణాలు జరిగాయి. గుండం చుట్టూ భక్తులకు వెళ్లేందుకు అనుగుణంగా స్టీల్ గ్రిల్స్‌ను ఏర్పాటు చేశారు. రెండు మండపాలను విభజిస్తూ స్టీల్ గ్రిల్స్, భక్తులు స్నానానికి వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు ప్రత్యేకంగా గ్రిల్స్‌ను బిగించారు. స్నానమాచరించి అనంతరం బట్టలు మార్చుకునేందుకు మహిళలు, పురుషులకు ప్రత్యేకమైన గదులు, మరుగుదొడ్లు నిర్మించారు. పుష్కరిణి సౌకర్యవంతంగా, విశాలంగా ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభువుల దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. కొండపైకి ఇతర వాహనాలకు అనుమతి లేకపోవడంతో కొండకింద పార్కింగ్ చేసి, ఆర్టీసీ సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో కొండపైకి చేరుకుంటున్నారు. బస్బే సువిశాలంగా ఉండటంతో ఎలాంటి ఇబ్బంది కలుగడంలేదని భక్తులు చెబుతున్నారు. క్యూ కాంప్లెక్స్‌లోని మొదటి అంతస్తులో టికెట్ల విక్రయశాల, సెల్‌ఫోన్, వస్తువులు భద్రపరిచేందుకు క్లాక్ రూం, సీసీ టీవీ కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ప్రతి భక్తుడి బ్యాగు, ఇతర సామగ్రిని తనిఖీ నిర్వహిస్తున్నారు. ఉచితంగా వెళ్లేందుకు భక్తులకు టికెట్లను పంపిణీ చేస్తున్నారు. క్యూ లైన్ల గుండా తూర్పు ద్వారం, తిత్రల రాజగోపురం నుంచి నేరుగా ప్రధానాలయంలోకి వెళ్లి భక్తులు స్వయంభువులను దర్శించుకుంటున్నారు.
మరింత నాణ్యత.. రుచికరంగా..
లడ్డూ ప్రసాదం తయారీలో యంత్రాలను వినియోగించడంతో మరింత రుచితోపాటు నాణ్యత ఉన్నదని భక్తులు చెప్తున్నారు. మంగళవారం లడ్డూ, ప్రసాద విక్రయాలతో స్వామివారికి రూ.8,17,580 ఆదాయం సమకూరింది. స్వామివారిని దర్శించుకుని తిరిగివచ్చే దారిలో శివాలయం వెనుక భాగంలో లడ్డూ ప్రసాదాల విక్రయశాలను నిర్మించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ గోల్డెన్ టెంపుల్ స్వయంభూ లక్ష్మీనరసింహస్వామివారి హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో లడ్డూ ప్రసాదం తయారీ జరుగుతున్నది. 16 గంటల్లో 50 నుంచి లక్ష లడ్డూలు తయారు చేసే అవకాశం ఉన్నది. తయారైన లడ్డూలను కన్వేయర్ బెల్టు ద్వారా విక్రయాల కౌంటర్ వద్దకు తీసుకువచ్చి భక్తులకు అందిస్తున్నారు.
తలనీలాలు ఇచ్చి.. మొక్కులు తీర్చి…
కొండకింద నిర్మితమైన కళ్యాణకట్ట వద్ద భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సౌకర్యాలు ఊహించని స్థాయిలో మెరుగుపడ్డాయని తెలిపారు. గండి చెరువుపక్కనే రూ.20.25 కోట్లతో నిర్మించిన రెండు హాళ్లను మంగళవారం అందుబాటులోకి తెచ్చారు. స్నానాలు, దుస్తులు మార్చుకునేందుకు మహిళలు, పురుషులకు వేర్వేరుగా గదులు నిర్మించారు. భక్తులకు వేడి నీటి సదుపాయాన్ని కూడా కల్పించారు. దుస్తులు, సామగ్రిని భద్రపరుచుకునేందుకు క్లాక్ రూం, కళ్యాణ కట్ట టిక్కెట్ల విక్రయానికి టోకెన్ కౌంటర్ రూంలతో పాటు, పర్యవేక్షణాధికారికి ప్రత్యేకమైన గదులను నిర్మించారు.
క్యూలైన్ల నిర్మాణం అద్భుతం..
క్యూలైన్ల నిర్మాణం అద్భుతంగా ఉంది. స్వామివారిని దర్శించుకునే ప్రతి ఒక్కరూ క్యూలోనే వెళ్లాలన్న నిబంధన చాలా బాగుంది. ఎంతటివారైనా క్యూలైన్లోనే వస్తే ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకోవచ్చు. గతంలో వీఐపీ వస్తే లైన్లను నిలిపివేసేది. ఇప్పుడా సమస్య ఉండకపోవచ్చు. ప్రధానాలయంలో క్యూలైన్లు, దర్శించుకునే తీరు, చివరికి పశ్చిమ సప్తతల రాజగోపురం నుంచి బయట రావడం చక్కగా ఉంది. ప్రధానాయంలో నిర్మాణాలు మహాద్భుతంగా ఉన్నాయి.
– రాజ్‌కుమార్, భక్తుడు, కరీంనగర్ జిల్లా కేంద్రం
లక్ష్మీ పుష్కరిణి బాగుంది..
పుణ్యస్నానాలు ఆచరించడానికి వీలుగా కొండ కింద లక్ష్మీపుష్కరిణి నిర్మాణం బాగుంది. గతంలో కొండపైనే స్నానమాచరించే వాళ్లం. కానీ ఇప్పుడు బస్సు దిగగానే ఆ పక్కనే ఉన్న పుష్కరిణిలో స్నానం చేసుకునే వీలుంది. పుష్కరిణి దగ్గర వసతులు చాలా నచ్చాయి. మరుగుదొడ్లు, బట్టలు మార్చుకునేందుకు వీలుగా మహిళలు, పురుషులకు ప్రత్యేక గదులు ఉన్నాయి.
– శ్రీనివాస్‌రెడ్డి, భక్తుడు, కీసరగుట్ట, మేడ్చల్ జిల్లా
స్వామివారి దర్శనం సంతోషాన్నిచ్చింది..
లక్ష్మీనరసింహస్వామి పునఃదర్శనం పూర్వజన్మ సుకృతం. సుదీర్ఘ కాలం తర్వాత స్వామివారి దర్శనం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆలయంలోకి వెళ్లగానే భక్తి భావం మరింత పెరుగుతుంది. స్వామివారి దర్శనం అనంతరం మనశ్శాంతిగా ఉంటుంది. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. కొండకింద కళ్యాణకట్ట, పుష్కరిణి, బస్బే నిర్మాణాలు అద్భుతం.
– చిన్నోళ్ల జంగమ్మ, జడ్పీటీసీ, యాచారం, రంగారెడ్డి జిల్లా