భువనగిరి కలెక్టరేట్ ఆగస్టు 26 : పెండింగ్ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ నాగపురి కృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి చేపడుతున్న ధర్నా కలెక్టర్ కార్యాలయం ముందు మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. 2023 నుండి ఇప్పటివరకు రావాల్సిన 42 లక్షల రూపాయల పెండింగ్ బిల్లులను చెల్లించాలని కుటుంబ సభ్యులతో కలిసి భువనగిరి మండలంలోని హనుమపురం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ కృష్ణ చేపడుతున్న ధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం అభివృద్ధి పనులను చేయించుకొని కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలో జాప్యం చేస్తుందని ఆరోపించారు.
అందిన కాడికల్లా అప్పులు చేసి కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులను చేపడితే బిల్లుల చెల్లింపులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం విడనాడాలన్నారు. కాంట్రాక్టర్లకు బకాయి పడ్డ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఏ ఒక్క పని కూడా సక్రమంగా చేపట్టడం లేదని, పెండింగ్ బిల్లుల విడుదలలో నిర్లక్ష్య ధోరణి వహిస్తుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లకు అండగా ఉంటామని పేర్కొన్నారు.