భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 23 : అనుమానాస్పద స్థితిలో వివాహిత ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన భూదాన్ పోచంపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం పట్టణ కేంద్రంలోని 13వ వార్డుకు చెందిన రామస్వామి అనిల్ రెడ్డి, అక్షయ దంపతులు. వీరికి 13 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. గత ఆరు నెలలుగా కుటుంబంలో కలహాలు చోటుచేసుకుంటున్నాయి. మంగళవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో అక్షయ (32) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అక్షయ ఉరి వేసుకుని మృతి చెందడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కట్టుకున్న భర్తే ఆమెను చంపి ఉరి వేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. చౌటుప్పల్ సీఐ రాములు, స్థానిక ఎస్ఐ కంచర్ల భాస్కర్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.