OTT Movies | కొత్త వారం ప్రారంభమైంది అంటే సినిమాల సందడి కూడా మొదలైనట్టే. ప్రతి వారం లాగే ఈసారి కూడా థియేటర్లతో పాటు ఓటీటీ వేదికలపై అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఉగాది పండుగ సందర్భంగా సినీ ప్రియులకు ఇది పూర్తి ఎంటర్టైన్మెంట్ వారం అని చెప్పాలి. ఈ వారం థియేటర్లలో రెండు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’, బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ సినిమాలు మార్చి 19న విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదే సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా వరుసగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు సిద్ధమయ్యాయి. మార్చి 16 నుంచి మార్చి 22 వరకు దాదాపు 20కి పైగా సినిమాలు మరియు సిరీస్‌లు విడుదల కానున్నాయి. అందులో కొన్ని ఆసక్తికరమైన విడుదలలు ఇవి.
ఈ ఏడాది జనవరిలో రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని సాధించిన దేశభక్తి చిత్రం ‘బోర్డర్ 2’ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. 1971 ఇండో–పాక్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ కథనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
హీరో సుధీర్ బాబు నటించిన మిథికల్ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర’ కూడా ఈ వారం స్ట్రీమింగ్కు సిద్ధమైంది. సోనాక్షి సిన్హా ప్రతినాయకురాలిగా నటించిన ఈ సినిమా కథ కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం చుట్టూ తిరిగే రహస్యాలపై ఆధారపడి సాగుతుంది.
గ్రామీణ ప్రేమ కథాంశంతో రూపొందిన ‘సుమతి శతకం’ సినిమా కూడా ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది. అమర్దీప్ చౌదరి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఒక గ్రామంలో మూఢనమ్మకాల మధ్య ప్రేమ కథ ఎలా సాగుతుంది అనే అంశాన్ని చూపిస్తుంది.
ప్రముఖ నటుడు అర్జున్ సర్జా దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతా పయనం’ రోడ్ రొమాంటిక్ డ్రామాగా రూపొందింది. ఐశ్వర్య అర్జున్, నిరంజన్ సుధీంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కథ వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు జరిగే ప్రయాణంలో ఒక యువతి జీవితంలో ఎదురయ్యే సంఘటనలపై ఆధారపడి ఉంటుంది.
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘కాసరగోడ్ ఎంబసీ’ కూడా ఈ వారం విడుదల కానుంది. నకిలీ పాస్‌పోర్టులు, సర్టిఫికెట్లు తయారు చేసే ఇద్దరు కజిన్స్ జీవితాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. క్రైమ్ థ్రిల్లర్ కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది మంచి ఎంపికగా ఉండనుంది.
సామాజిక అంశంతో తెరకెక్కిన హిందీ వెబ్ సిరీస్ ‘చిరయ్య’ కూడా ఈ వారం విడుదల అవుతోంది. వైవాహిక అత్యాచారం (Marital Rape) వంటి సున్నితమైన అంశంపై ఈ సిరీస్ కథ సాగుతుంది.
1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం నేపథ్యంలో రూపొందిన చారిత్రాత్మక మ్యూజికల్ స్పై థ్రిల్లర్ ‘జాజ్ సిటీ’ కూడా ఈ వారం సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. సంగీతం, రాజకీయాలు, గూఢచర్యం కలిసిన కథ ఈ సిరీస్ ప్రత్యేకత.
నెట్‌ఫ్లిక్స్
ఏ డిఫరెంట్ మ్యాన్ – మార్చి 20
బోర్డర్ 2 – మార్చి 20
పీకి బ్లైండర్స్: ఇమ్మోర్టల్ మ్యాన్ – మార్చి 20
బీటీఎస్: ది కమ్ బ్యాక్ – మార్చి 21
జియో హాట్‌స్టార్
ఆస్కార్ అవార్డ్స్ 2026 – మార్చి 16
చిరయ్య – మార్చి 20
వీక్డ్ ఫర్ గుడ్ – మార్చి 21
జీ5
ఆగా ఆగా సుంబాయి – మార్చి 19
ల్యాండ్ లార్డ్ – మార్చి 19
జటాధర – మార్చి 20
కాసరగోడ్ ఎంబసీ – మార్చి 20
సోనీ లివ్
జాజ్ సిటీ – మార్చి 19
అమెజాన్ ప్రైమ్ వీడియో
ది హౌస్ మెడ్ – మార్చి 19
డెడ్ లాచ్ సీజన్ 2 – మార్చి 20
సన్ నెక్ట్స్
సీతా పయనం – మార్చి 20
వలవార – మార్చి 20
ఈటీవీ విన్
సుమతి శతకం – మార్చి 19
మొత్తానికి ఈ వారం థియేటర్లలో భారీ సినిమాలు, ఓటీటీలో వరుస విడుదలలతో ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదం లభించనుంది. ఉగాది సందర్భంగా సినిమా ప్రియులకు ఇది నిజంగా ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్‌లా మారబోతోంది.