ఆలేరు టౌన్, జూలై 14 : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య డిమాండ్ చేశారు. ఆలేరు పట్టణ కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు. కేసీఆర్కు పేరు వస్తదనే అక్కస్సుతోనే సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లు విడుదల చేయకుండా ఉన్నారని, రైతుల గోడును పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో కాలం కాక, రైతులు వేసిన పంటలకు నీళ్లు రాక, పంటలు ఎండిపోయి అరిగోస పడుతుంటే రైతులను పట్టించుకోకపోవడం పట్ల ఆయన మండిపడ్డారు. రైతు భరోసా, రైతు బంధు, రూ.4 వేల పెన్షన్, విద్యార్థులకు స్కూటీలు, కల్యాణణ లక్ష్మి ద్వారా తులం బంగారం మొదలగు పథకాలను తుంగలో తొక్కి కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ ప్రజలతో చెలగాటమాడుతుందన్నారు.
బీర్ల ఐలయ్య నీళ్ల ఐలయ్య అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బీర్ల ఐలయ్య ఏ చెరువులో, ఏ కాల్వలో తట్టెడు మట్టి తీశాడో చూపించాలని ఆ పార్టీ నాయకులు వస్పరి శంకరయ్య సవాల్ విసిరారు. గత పది సంవత్సరాలుగా కేసీఆర్ కాళేశ్వరం నీళ్లను అందించి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తే, కేసీఆర్ ఆనవాళ్లను తుడుపేస్తాం, చెరిపేస్తామని రేవంత్ రెడ్డి మాట్లాడడం శోచనీయమన్నారు. రాజకీయాలు కేవలం ఎన్నికల ముందు చేయాలే తప్పా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. కొత్తగా బీసీ నినాదంతో తెలంగాణ ప్రజలను మరో ఒకసారి మోసం చేయాలనే అక్కస్సుతో ఎన్నికల్లోకి వస్తున్నారని, తెలంగాణ ప్రజలు జాగ్రత్త పడాలని ఆయన సూచించారు.