సూర్యాపేట, ఫిబ్రవరి 5: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సూ ర్యాపేటలోని 48వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతున్నది. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని, రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన మోసాలను పట్టణ ప్రజలే గుర్తు చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారు. మాకు మోసాల కాంగ్రెస్ వద్దని, అభివృద్ధి చేసే బీఆర్ఎస్ పార్టీయే కావాలంటూ ముక్త కంఠంతో చెబుతున్నారు. గురువారం సూర్యాపేటలోని 5, 9, 14, 28, 34, 35 వార్డుల్లో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సుడిగాలి పర్యటన చేసి పార్టీ కార్యాలయాలను ప్రారంభించి ఆయా వార్డుల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భం గా వార్డుల్లోని కాంగ్రెస్, బీజేపీల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. వారికి జగదీశ్‌రెడ్డి గులాబీ కం డువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీది బాగు చేసే పని కాదని..చెడగొట్టే పని అన్నారు.
కేసీఆర్ మళ్లీ వస్తే బాగుండని జనమంతా బలంగా అనుకుంటున్నారని, పదేండ్లలో చేసిన అభివృద్ధిని కొనియాడుతూ పట్టణాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో నాయకులు ఆగం చేశారన్నారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోయామని జనం భావిస్తున్నారన్నారు. మోసపోతే గోసపడతామని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పిండని, కాంగ్రెస్ మాయగాళ్లను నమ్మినందుకు నట్టేట ముంచారన్నారు. కేసీఆర్ తనను ఎమ్మెల్యే చేయడంతో పాటు మంత్రిని కూడా చేశారని దీంతో వేల కోట్లు తెచ్చి సూర్యాపేటను అభివృద్ధి చేశానన్నారు. 30 సంవత్సరాలుగా మూసీ మురికి నీటి కోసం నల్లాల వద్ద పంచాయితీలు పెట్టుకొని పోలీస్టేషన్లకు వెళితే, కేసీఆర్ వచ్చాక స్వచ్ఛమైన కృష్ణానది నీటిని మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి అందజేశారన్నారు. నాడు కరెంట్ ఎప్పుడు వస్తదో ఎప్పుడు పోతదో తెలిసేది కాదని, పరీక్షలప్పుడు పిల్లలు దీపం పెట్టుకునేందుకు కిరసనాయిల్ కూడా దొరకేది కాదన్నారు. కేసీఆర్ వచ్చాక 24గంటల కరెంట్‌ను అందించాడని గుర్తు చేశారు.
తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న కాలంలో సూర్యాపేటలో నడిచేందుకు కూడా వీలు లేని రోడ్లను సీసీ రోడ్లుగా మార్చడమే కాకుండా డ్రైనేజీలు ఏర్పాటు చేసి దోమలు లేకుండా చేశానన్నారు. నేడు దోమలు, పందులతో పాటు అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగాయని, అభివృద్ధిని నాశనం చేస్తున్నారని అన్నారు. నాటిన చెట్లకు నీళ్లు కూడా పోయకుండా ఎండబెడుతున్నారని ట్యాంక్ బండ్‌ను సర్వనాశనం చేశారన్నారు. కారు అంటే అభివృద్ధి అని, కాంగ్రెస్ అంటే అరాచకమని అన్నారు. పట్టణ ప్రజలు మరోసారి మోసపోకుండా అరాచక కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట మున్సిపాల్టీలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కార్యక్రమంలో వార్డుల అభ్యర్థులు ఆదిముళ్ల విజయశ్రీ, తాహేర్, గాలి సాయినాయుడు, గుండగాని జానకమ్మ, వల్దాస్ జాని, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఉప్పల ఆనంద్, మారిపెద్ది శ్రీనివాస్, కొండ మధు, నెమ్మాది కృష్ణ, జుట్టుకొండ గణేశ్, చింతలపాటి భరత్ మహాజన్, గునగంటి శ్రీనివాస్, మొహినొద్దీన్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.