రాజాపేట, ఆగస్టు 26 : ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పర్మిషన్ తీసుకుని చాటు ప్రదేశాల్లో డంప్ చేసి లారీల్లో ఆక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ఇసుక మాఫియాపై ఉక్కు పాదం మోపనున్నట్లు యాదగిరిగుట్ట రూరల్ సీఐ ఎం.శంకర్ హెచ్చరించారు. మంగళవారం రాజపేట పోలీస్ స్టేషన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇసుక మాఫియాను అరికట్టేందుకు గతంలో కేసులు నమోదు చేసి రౌడీషీటర్ ఓపెన్ చేసినట్టు తెలిపారు. అయినా పట్టింపు లేకుండా అలాగే దందా కొనసాగిస్తామంటే ఊరుకునేది లేదన్నారు. అక్రమ సంపాదనకు పోయి కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టుకోకూడదని హితవు పలికారు.
గణేష్ మండప నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు మండలంలో చాలా తక్కువగా దరఖాస్తులు వచ్చాయని, ప్రతి ఒక్కరు నమోదు చేసుకోవాల్సిందేనని తెలిపారు. అధికారులు సూచించిన చెరువుల్లోనే నిమజ్జనం చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా, వాగ్వాదాలు, వివాదాలకు వెళ్లకుండా శాంతియుతంగా నవరాత్రులు జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు.