రాజాపేట, జనవరి 05 : గ్రామాల్లో వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం రాజాపేట మండలంలోని బసంతాపురం గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో లబ్ధిదారులు మొత్తం ఎంతమంది ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. అందులో ఎన్ని ఇండ్లు పూర్తయ్యాయని, ఎన్ని ఇండ్లు చివరి దశలో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పనులు మొత్తం కూడా వేగంగా నిర్మాణం పూర్తి అయ్యేలా చూడాలన్నారు.
గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్న వారికి ఇటుక, ఇసుక తక్కువ ధరకు ఇప్పించేలా సంబంధిత అధికారులు చొరవ చూపాలన్నారు. లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసుకుని గృహ ప్రవేశాలు చేపట్టాలన్నారు. నిర్మాణ పనులు పూర్తయినంత వరకు డబ్బులు జమ అయ్యాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పరిశీలించి, లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మెండు రత్నమాల సత్తిరెడ్డి, ఎంపీడీఓ నాగవేణి, ఎంపీఓ కిషన్ పాల్గొన్నారు.