యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 20 : భారతదేశం అంతటా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే, తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో మీడియాతో ఆమె మాట్లాడారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యంతో రేవంత్ రెడ్డి అజెండాతో అనేక మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్ పర్సన్ సీట్లను కైవసం చేసుకుందన్నారు. అంతేకాకుండా కౌన్సిలర్లను డబ్బులకు కొనుగోలు చేయడం, లేదంటే బెదిరింపులకు పాల్పడడం లేదా వివిధ మార్గాలను ఎంచుకోవడం చేసినట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నరని దుయ్యబట్టారు.
కార్యకర్తలు వాళ్ల వాళ్ల పార్టీల అభ్యర్థులను కష్టపడి గెలిపించుకుంటే వాళ్లకి అధికారం లేకుండా చేస్తున్నరన్నారు. రేవంత్ రెడ్డికి తాను ఒక సలహా ఇవ్వదలుచుకున్నా ఇకనుంచి ఎన్నికలు పెట్టకుండా వారికి ఇష్టం వచ్చిన వారిని నామినేట్ చేసుకుని ఈ రాజ్యాన్ని ఏలుకోవాలన్నారు. ఇంకా రెండున్నర సంవత్సరాలు మాత్రమే వారి ఆటలు సాగుతాయని, వచ్చే ప్రభుత్వం తమ కేసీఆర్ ప్రభుత్వమేనని, అప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఏంటో బీఆర్ఎస్ పార్టీ చూపిస్తదని ఆమె పేర్కొన్నారు.