Yadadri | వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ సహా రాష్ట్రంలోని నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు యాదాద్రికి పోటెత్తారు. భక్త జనసందోహంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.
లక్ష్మీనరసింహ స్వామి వారి ప్రత్యేక దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది. ధర్మదర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు.

Yadadri2
ఇదిలా ఉండగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఈవో భవానీ శంకర్, అర్చకులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ఉదయ పూజలు, అభిషేక సేవలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్శనానంతరం ఆలయ అధికారులు కిషన్ రెడ్డికి స్వామి వారి తీర్థ ప్రసాదాలతో పాటు జ్ఞాపికను అందజేశారు.