యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో హరిహరులకు సోమవారం ప్రత్యేక పూజల కోలాహలం నెల కొంది. వైష్ణవాగమశాస్త్ర రీతిలో యాదాద్రీశుడికి, శైవాగమశాస్త్ర రీతిలో కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్ధనీ సమేత రామ లింగేశ్వరుడి పూజాదులు కొనసాగాయి. శివుడికి రుద్రాబిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్త జనులు విశేష సంఖ్యలో పాల్గొని రుద్రాభిషేకం జరిపించారు. ఉదయాన్నే శివుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. విభూతితో ఆలంకరణ చేశారు. ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహా లకు అభిషేకం చేసి అర్చన చేశారు.
శివాలయం ఉప ప్రధాన పురోహితుల ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ జరిపారు. నిత్య పూజలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి. బాలాలయంలో కవచమూర్తులను అభిషేకించి అర్చించిన అర్చక బృందం బాలాల యంలో సుదర్శన నారసింహహోమం జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యా ణోత్సవం ఆగమశాస్త్ర రీతిలో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారి నిత్య కైంకర్యాలలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.