భూదాన్ పోచంపల్లి, ఏప్రిల్ 04 : చేనేత కార్మికులకు చేయూతనిచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం వల్ల చేనేత కార్మికులు బతకలేని పరిస్థితి దాపురించిందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌తో కలిసి శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో చేనేత కార్మికుల జీవన స్థితిగతులు, చేనేత మగ్గాల పనితీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చేనేత కార్మికులకు చెప్పినవన్నీ అమలు చేసి వారికి మరింత మేలు చేయాలన్నారు. ఉన్న సంక్షేమ పథకాలను రద్దుచేసి చేనేత కార్మికుల ఉసురు తీయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల మాదిరిగానే రెండు లక్షల రుణమాఫీని చేనేత కార్మికులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులవృత్తులను పూర్తిగా నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు.
Bhoodan Pochampally : ప్రభుత్వ పథకాల రద్దుతో చేనేత కార్మికులు బతకలేని పరిస్థితి : మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్
గీత కార్మికులకు ప్రమాద బీమా పథకం కింద రూ.10 లక్షలు ఇస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదని విమర్శించారు. చేనేత వస్త్రాల కొనుగోలు టెస్కో ద్వారా చేపట్టి వారికి మార్కెట్ సౌకర్యాన్ని కల్పించి, కార్మికులను ఆదుకోవాలన్నారు. భూదాన్ పోచంపల్లికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. భూదానోద్యమ స్ఫూర్తి, ఇక్కత్ పట్టువస్త్రాల తయారీకి ప్రపంచ ప్రసిద్ధి చెందిందన్నారు. భూదాన్ పోచంపల్లి పర్యాటక కేంద్రానికి మరిన్ని నిధులు కేటాయించి తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బాతుక లింగస్వామి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చిలువేరు బాలనరసింహ, పట్టణ ప్రధాన కార్యదర్శి గునిగంటి మల్లేశ్ గౌడ్, పట్టణ కార్యదర్శి సీత శ్రవణ్, బీఆర్ఎస్ యూత్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు చింతకింది కిరణ్, కొంక లక్ష్మీనారాయణ, చేనేత కార్మికులు సీత ప్రసాద్, జయమ్మ పాల్గొన్నారు.
Bhoodan Pochampally : ప్రభుత్వ పథకాల రద్దుతో చేనేత కార్మికులు బతకలేని పరిస్థితి : మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్