సిద్దిపేట, మార్చి 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వ్యవసాయంలో మూస పద్ధతులు వీడి.. రైతులకు కొత్త సాగు దారులు చూపించి ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేసేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషికి మరో ఫలితమిది. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ చేపట్టిన పనులు ఇవ్వాళ రైతుల కండ్ల ముందు కదలాడుతున్నాయి. ఆయిల్‌పామ్ అంటే ఏమిటో తెలియని ఈ ప్రాంత రైతులకు పరిచయం చేసి ఈ ప్రాంతంలో అయిల్‌పామ్ తోటలు పెంచేలా రైతులకు కేసీఆర్ వెన్నుదన్నుగా నిలిచారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీజం పడింది. కేసీఆర్ నాయకత్వంలో అంకురార్పణ చేసి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నిరంతర పర్యవేక్షణ, క్షేత్ర స్థాయి పర్యటనలు, ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడంతో నేడు పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధమైంది.
కాలుష్య రహితంగా ఫ్యాక్టరీ నిర్మించారు. నిరుడు సెప్టెంబర్‌లో ట్రయల్ రన్ చేశారు. మలేషియా నుంచి వచ్చిన అంతర్జాతీయ కన్సల్టెంట్ బృందం రెండు రోజుల పాటు ఫ్యాక్టరీలోని అన్ని యంత్రాలను పరిశీలించి ట్రయల్ రన్ నిర్వహించింద. ఇప్పటికే బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఫ్యాక్టరీ పనులు, ట్రయల్ రన్ విధానాన్ని పరిశీలించింది.ఈ నెల 20 నుంచి 22 వరకు ఇక్కడ రైతు మేళా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. రైత మేళా ముగింపు కార్యక్రమం, ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఈనెల 22న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. అదే రోజు రూ. 40 కోట్లతో రిఫైనరీ మిల్లుకు శంకుస్థాపన చేయనున్నారు.

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట శివారులో 62 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో తెలంగాణ ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలి రిఫైన్డ్ పామాయిల్ ఫ్యాక్టరీని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. 2022, ఏప్రిల్ 13న ప్రాజెక్టుకు అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఆర్థిక మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు భూమి పూజ చేశారు. భూసేకరణ పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో ఎప్పటి కప్పుడు హరీశ్‌రావు పరిశీలించి పనులను వేగవంతం చేయించారు. తొలి నాలుగు పంటల దిగుబడి చేతికి రావడంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నర్మెటలోనే కొనుగోలు చేయించారు. రైతులు తమ పంట దిగుబడిని తీసుకవచ్చి నర్మెట ఫ్యాక్టరీ వే బ్రిడ్జి వద్ద తూకం వేస్తున్నారు. పంట దిగుబడి డబ్బులు రైతుల ఖాతాలో జమవుతున్నాయి. రైతుల పొలాల నుంచి నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ వరకు దిగుబడులు తెచ్చేందుకు రవాణా ఖర్చును కూడా రాష్ట్ర ఆయిల్ ఫెడ్ భరిస్తున్నది.
నర్మెట ఫ్యాక్టరీని అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి నిర్మించారు. ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో నూనె ఉత్పత్తి చేయడమే కాదు.. రిఫైనరీని పెట్టి తుది ఉత్పత్తి ఇకడి నుంచే నేరుగా మారెట్లోకి పంపేలా ఏర్పాట్లు చేశారు. ఆయిల్‌పామ్ పండ్ల గుజ్జు నుంచి ముడి నూనె తీసి రిఫైన్డ్ చేసి పామాయిల్‌ను ప్యాకెట్స్ రూపంలో మార్కెట్లోకి తెస్తారు. 10 కోట్ల లీటర్ల నిలువ సామర్థ్యంతో నీళ్ల ట్యాంకు ఏర్పాటు చేశారు. ఆయిల్‌పామ్ గెలల నుంచి వెలువడే బయోమాస్ వ్యర్థాలతో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. 4 మెగావాట్ల సెల్ఫ్ జనరేషన్ విద్యుత్తుఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒక్క యూనిట్‌కు రూ.1.50 మాత్రమే ఖర్చుతో విద్యుత్తు ఉత్పత్తి కానుండటంతో భారం తప్పనున్నది. వాడిన నీటిని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా రీ సైకిల్ చేసే పద్ధతి కూడా ఉన్నది. ఈ ఫ్యాక్టరీలో మొదట గంటకు 30 టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్యం, గెలల పరిమాణం పెరుగుతున్న కొద్దీ క్రషింగ్ సామర్థ్యాన్ని గంటకు 120 టన్నులకు పెంచుకునే వీలు కల్పించారు. గంటకు 120 టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్యంతో ఫ్యాక్టరీ కట్టడం దేశంలోనే తొలిసారి.
ఈ పరిశ్రమ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది. సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల నుంచి వచ్చే ఆయిల్ పామ్ గెలలను క్రషింగ్ చేస్తుంది. గెలల క్రషింగ్ ద్వారా వచ్చే ముడి పామ్‌ఆయిల్‌ను శుద్ధి చేసేందుకు రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా పామాయిల్ రిఫైనరీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. రూ.40 కోట్లతో పనులకు 22న భూమి పూజ చేస్తారు. ప్లాంట్ నుంచి ఎలాంటి వ్యర్థాలు రాకుండా జీరో లిక్విడ్ డిశ్చార్జిని నెలకొల్పారు. అదే నీటిని రీసైక్లింగ్ పద్ధతి ద్వారా వాడుకుంటారు. ఈ ఫ్యాక్టరీతో అనేక ప్రయోజనాలున్నాయి. ఇక్కడే వంట నూనె తయారు చేస్తారు. కాయల నుంచి వచ్చే పీచుతో పరుపులు తయారు చేస్తారు. వ్యర్థ్ధాలను చేపల ఎరువు, బయోగ్యాస్‌కు ఉపయోగిస్తారు. ఈ ఆయిల్‌పామ్ మిల్లు ఏర్పాటుతో ప్రత్యక్షంగా 250 మందికి, పరోక్షంగా 2000 మందికి ఉపాధి దొరకనున్నది.
ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగూడెం జిల్లాలో ఆయిల్‌ఫెడ్ స్థాపించిన రెండు ప్రాసెసింగ్ మిల్లులు ఉన్నాయి. మరో 6 మిల్లులు (కల్లూరుగూడెం-ఖమ్మం, కొణిజర్ల- ఖమ్మం, బీచుపల్లి- గద్వాల, ఇంచర్ల -ములుగు, పెద్దరాత్పల్లి-పెద్దపల్లి, సంకిరెడ్డిపల్లి- వనపర్తి) నిర్మాణంలో ఉన్నాయి. భద్రాది కొత్తగుడెం జిల్లా అశ్వారావుపేటలో గంటకు 30 టన్నులు, అప్పారావుపేటలో 90 టన్నుల సామర్థ్యంతో అయిల్‌పామ్ ఫ్యాక్టరీలున్నాయి. వీటి నుంచి వచ్చే క్రూడ్ పామాయిల్‌ను హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఆయిల్‌ఫెడ్‌కు పంపి అక్కడ రిఫైన్డ్, ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి పంపేవారు. సిద్దిపేట ఫ్యాక్టరీలో మా్రత్రం పామాయిల్ పండ్ల గుజ్జు నుంచి క్రూడ్ పామాయిల్ తీసి రిఫైన్డ్, ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి పంపిస్తారు. గంటకు 25 టన్నుల పామాయిల్ ప్యాకింగ్ చేయనున్నారు.
రాష్ట్రంలో 1992 నుంచి ఇప్పటివరకు ఆయిల్‌పామ్ సాగులోకి వచ్చిన విస్తీర్ణం 2.91 లక్షల ఎకరాలు (79,379 మంది రైతులు). డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు ఎన్ఎంఈవో- ఓపీ ( నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్‌పామ్ )పథకంలో భాగంగా 1,08,455 ఎకరాలు (33,723 రైతులు) సాగులోకి వచ్చాయి. సిద్దిపేట జిల్లాలో 4,379 మంది రైతులు 14,290 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.ఈవోపీ పథకం అమలులో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. ప్రస్తుతం 68,600 ఎకరాల్లో గెలలు ఉత్పత్తి అవుతున్నాయి. పామాయిల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలంటే దేశంలో సుమారు 70 లక్షల ఎకరాల్లో సాగు చేయడం అవసరం.
దేశీయ పామాయిల్ ఉత్పత్తిలో 98 శాతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే అవుతున్నది. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు ఎకరానికి రూ.50,918 (4 సంవత్సరాలకు) రాయితీ ఇస్తున్నారు. టన్నుకు రూ.12,534గా ఉన్న ఆయిల్ పామ్ గెలల ధర, ప్రస్తుతం రూ.21,546 చేరింది. రాష్ట్రంలో ఈ ఏడాది 47,260 ఎకరాల్లో (14,730 రైతులు) రైతులు మొకలు నాటారు. రాష్ట్రంలోని 14 ఆయిల్ పామ్ కంపెనీలు మొకల సరఫరాకు 45 నర్సరీలు ఏర్పాటు చేశాయి.

విత్తనం నాటింది బీఆర్ఎస్ ప్రభుత్వమై తే పండ్లు తినేందుకు కాంగ్రెస్ సర్కార్ బయ లు దేరింది. మొక్కపెట్టింది, అధ్యయనం చేయించింది. ఫ్యాక్టరీ మంజూరు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాగా కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ప్రారంభిస్తున్నది. పామాయిల్‌కు పుట్టినిల్లు మలేషియా కాగా అకడి టెక్నాల జీ బాగుందని ఇకడ అందుబాటులోకి తె చ్చారు. దేశంలో ఏ పామాయిల్ ఫ్యాక్టరీకి అయినా వంద టన్నుల గెలలు పంపితే 19 టన్నుల ఆయిల్ మాత్రమే వస్తుంది. కానీ ఈ ఫ్యాక్టరీలో 100 టన్నుల గెలలకు 20 ట న్నుల పామాయిల్ ఉత్పత్తి అవుతుంది. ఈ లాభాలన్నీ రైతుకే అందుతాయి. ఇప్పటికే గోద్రేజ్, నవభారత్, పతంజలి కంపెనీలు వచ్చి ఇక్కడి టెక్నాలజీని చూసి వెళ్లాయి. ఫ్యాక్టరీ నిర్మాణంలో కాంగ్రెస్ సర్కార్ పాత్ర ఏమాత్రం లేకున్నా.. అంతా సిద్ధమైన తర్వాత ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తుండటంపై స్థానిక రైతులు పెదవి విరుస్తున్నారు.
కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరంతో సిద్దిపేట జిల్లాలో వాతావరణం ఆయిల్‌పామ్ సాగుకు అనుకూలంగా మారింది. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మాజీ మంత్రి హరీశ్‌రావు ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రత్యేక కృషి చేశారు. నిరంతర పర్యవేక్షణతో అధికారులకు దిశానిర్దేశం చేశారు. భూసేకరణలో రైతులను ఒప్పించి మెప్పించి ఫ్యాక్టరీ నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ చేయించారు. తొలినాళ్లలో సిద్దిపేటకు పామాయిల్ పంట తెచ్చే ప్రయత్నంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు. ఐఐవోఆర్ (ఇండియన్ రీసెర్చ్ ఇనిస్ట్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ రీసెర్చ్) వారు చెప్తే తప్ప ఇకడ పామాయిల్ సాగు చేసే పరిస్థితి లేదు. 2018లో ఇకడ ఆయిల్‌పామ్ సాగు చేయరాదు అని ఐఐవోఆర్ వాళ్లు తేల్చిచెప్పారు. గాలిలో తేమశాతం తకువ ఉన్నదని, పామాయిల్ సాగుకు అనుకూలం కాదని స్పష్టంచేశారు.
ఆ తర్వాత 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, చెరువులు, చెక్ డ్యాముల్లో నీళ్లు నిండుకుండల్లా ఉండటంతో 2021లో మళ్లీ పరిశోధన చేసిన తర్వాత గాలిలో తేమ శాతం పెరిగింది. అప్పుడు ఇకడ పామాయిల్ సాగు చేసుకోవచ్చని ఐఐవోఆర్ ప్రకటించింది. దీంతో 2022, జూన్ 5న నంగునూరు మండలం రామచంద్రాపూర్‌లో రైతు మడుగు ఎల్లారెడ్డి పొలంలో మొదటి పామాయిల్ మొకకు బీజం పడింది. అలా ఒక్కో రైతును గుర్తించి ఒక్కో ఎకరం పెట్టించి ఇవ్వాళ ఇక్కడిదాకా హరీశ్ కృషితో వచ్చింది.
