దుండిగల్, మార్చి15: బాచుపల్లిలోని ఏపీఆర్ ప్రణవ్ అంటీల్లావాసులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా వచ్చి క్షమాపణలు చెప్పాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ అన్నారు. నిజాంపేట్ సర్కిల్ పరిధి బాచుపల్లిలోని ఏపీఆర్ ప్రణవ్ అంటీల్లా గేటేడ్ కమ్యూనిటీవాసులు మల్లంపేట్‌కు వెళ్లే రహదారికి అడ్డుగా ప్రహరీని నిర్మించారని పేర్కొంటూ ఈనెల 9వ తేదీన హైడ్రా అధికారులు సదరు ప్రహరీని కూల్చివేసిన నేపథ్యంలో ఆదివారం సీపీఐ జాతీయ నాయకులు నారాయణ ఏపీఆర్ ప్రణవ్ అంటీల్లాను సందర్శించారు.
సంఘటనకు సంబంధించిన వివరాలను స్థానికులు, సంక్షేమ సంఘం ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం నారాయణ మాట్లాడుతూ.. ఏపీఆర్ ప్రణవ్ అంటీల్లా గ్రీన్‌బెల్ట్ ఏరియాలో నిర్మించిన ప్రహరీని హైడ్రా ఏవిధంగా కూల్చుతుందని ప్రశ్నించారు. ఇక్కడి పరిస్తితులను చూస్తుంటే హైడ్రా ఏకపక్షంగా వ్యవహరించిందని, కాలనీవాసుల అభిప్రాయాలను తీసుకోకుండా ప్రహరీని కూల్చివేసిందన్నారు.
రియల్టర్లకు లబ్ధిచేకూర్చేందుకే..!
కేవలం రియల్టర్లకు లబ్ధిచేకూర్చేందుకే ప్రహరీని హైడ్రా కూల్చివేసినట్లు తాము భావిస్తున్నామన్నారు. మొదట్లో హైడ్రాను సమర్ధించిన తాము ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో అనుమానించాల్సి వస్తుందన్నారు. ఇక్కడ జరిగిన పరిస్థితులను చూస్తుంటే హైడ్రా కమిషనర్ తప్పుచేసినట్లు అనిపిస్తుందన్నారు. రంగనాధ్ స్వయంగా కాలనీకి వచ్చి చేసిన తప్పుకు గాను ఇక్కడి ప్రజలకు స్వయంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో ఆయనను తాము వదిలిపెట్టబోమన్నారు.
ఈ విషయమై అన్ని వేదికలపై చర్చిస్తామన్నారు.ప్రహరీని కూల్చడమే కాకుండా అక్కడ రోడ్డును నిర్మించడం చూస్తుంటే హైడ్రా రానురాను రియల్ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా పనిచేస్తుందేమో అనిపిస్తుందన్నారు. ఇక నుంచి ఇక్కడ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తమపార్టీ స్థానిక నేతలు, కార్యకర్తలు పోరాడుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్ ప్రణవ్ అంటీల్లా గేటేడ్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ రాజిరెడ్డితో పాటు కాలనీ వాసులు, స్థానిక సీపీఐ నేతలు తదితరులు పాల్గొన్నారు.