ఆత్మకూరు(ఎం), నవంబర్ 03 : ఆత్మకూరు(ఎం) మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వం పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి వేముల భిక్షం అన్నారు. సోమవారం మండలంలోని తుక్కపురంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకునేందుకు గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశులు పోశారు. కానీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి 10 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో ఇటీవల కురిసిన అకాల వర్షంతో ధాన్యం రాశులు మొలకెత్తాయి. సోమవారం సిపిఎం నాయకులు కొనుగోలు కేంద్రాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర అందివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గాదె ఎల్లయ్య, సిపిఎం మండల కమిటీ సభ్యులు శ్రీశైలం, బీరయ్య, నగేశ్, వెంకన్న, ప్రేమలత, గోవిందమ్మ, శ్రీలత పాల్గొన్నారు.