రామన్నపేట, నవంబర్ 11 : రామన్నపేట మండల వ్యాప్తంగా దాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, మిల్లర్ల దోపిడీని అరికట్టాలని సిపిఎం మండల కమిటీ సభ్యుడు బల్గురి అంజయ్య అన్నారు. మంగళవారం స్థానిక సిపిఎం మండల కార్యాలయంలో జరిగిన మండల కమిటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గత నెల రోజులకు పైగా దాన్యం పోసి కొనుగోళ్లు కాక, వాతావరణం సహకరించక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు అనేక మంది రైతుల ధాన్యం కొట్టుకుపోగా, మరికొందరిది తడిసి మొలకెత్తిందన్నారు. అప్పులు చేసి ఆరుగాలం కష్టపడి పెట్టుబడి పెట్టి చేతికొచ్చిన పంట కొనకుండా ప్రభుత్వం కాలయాపన చేయడంతో రైతులకు టార్పాలిన్లు, కూలిల ఖర్చు మీద పడుతుందన్నారు. లారీలు, భార్దాని, హమాలీల కొరత లేకుండా వెనువెంటనే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.
రైస్ మిల్లర్లు కోర్రిలు పెడుతూ కోత విధించటంతో రైతులకు ఏం మిగలక ఇబ్బంది పడుతున్నారని, అధికారులు రైస్ మిల్లు యాజమాన్యాలతో కుమ్మక్కయి రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వెంటనే కొనుగోలును పూర్తి చేసి, రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటి సభ్యుడు వనం ఉపేందర్, మండల కార్యదర్శివర్గ సభ్యులు కూరెళ్ల నర్సింహాచారి, బోయిని ఆనంద్, కందుల హనుమతు, జంపాల అండాలు, రైతు సంఘం మండలాధ్యక్షుడు గన్నేబోయిన విజయభాస్కర్, మాజీ వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, నాయకులు గొరిగే సోములు, బావండ్లపల్లి బాలరాజు, వేముల సైదులు, ఆవనగంటి నగేశ్, శాఖ కార్యదర్శులు మునికుంట్ల లెనిన్, శానగొండ వెంకటేశ్వర్లు, గుండాల ప్రసాద్, గంగాదేవి అంజయ్య పాల్గొన్నారు.