బీబీనగర్, ఆగస్టు 19 : ప్రభుత్వం గొలుసుకట్టు చెరువులను, దానికి సంబంధించిన కాల్వల మరమ్మతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ముదిరాజ్ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పిట్టల అశోక్ ముదిరాజ్ అన్నారు. వడపర్తి కత్వ నుండి బీబీనగర్‌కు వచ్చే రాచకాల్వను మత్సకారులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాచకాలువలో కంప చెట్లు, తుంగ విపరీతంగా ఉండడం వల్ల నీటి ప్రవాహం అడ్డుకుంటుందన్నారు. గత వర్షాకాలంలో కాలువకు పడిన గండ్లు పూడ్చకపోవడంతో నీరు బీబీనగర్ చేరుకోవడం లేదన్నారు. బీబీనగర్ పెద్ద చెరువుకు ఎలాంటి ప్రమాదం ఏర్పడినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. చెరువు అలుగు కింద గతంలో ఏర్పడిన బుంగ నేటి వరకు మరమ్మతులకు నోచుకోలేదని, కట్టపై అనేక పమాదకరమైన గుంతలు ఏర్పడ్డాయని, వర్షాలు ఎక్కువైతే కట్ట తెగిపోయే ప్రమాదం ఉందన్నారు.
వర్షాకాలంలో అత్యవసర మరమ్మతులకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, కలెక్టర్, ఎమ్మెల్యే నిధులు ఇవ్వకపోవడం గొలుసుకట్టు చెరువులను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయనడానికి నిదర్శనమన్నారు. వర్షాకాలంలో కాల్వలు, చెరువుల అత్యవసర మరమ్మతుల కోసం ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించాలని, ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుషాంగల శంకర్, బోయిన కృష్ణ, గంగాదేవి కృష్ణ, పిట్టల సంతోశ్, గుండెగాల్ల సతీశ్ పాల్గొన్నారు.
Bibinagar : చెరువుల మరమ్మత్తులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం : పిట్టల అశోక్