-హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరి
– వాహనదారులకు బీబీనగర్ సీఐ ప్రభాకర్‌రెడ్డి అవగాహన
బీబీనగర్, జనవరి 21 : రోడ్డు ప్రమాదాల వల్ల అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బీబీనగర్ సీఐ ప్రభాకర్ రెడ్డి సూచించారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా హైదరాబాద్-వరంగల్ టోల్ ప్లాజా సిబ్బంది, బీబీనగర్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనదారులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్ వినియోగించాలని సూచించారు. అతివేగంతో వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, మొబైల్ ఫోన్ ఉపయోగించడం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.
అలాగే రోడ్డుపై ప్రమాదానికి గురైన వారిని చూస్తే రోడ్డుపై అలాగే వదిలేయకుండా వెంటనే సమీప దవాఖానకు తరలించి చికిత్స అందేలా చూడాలని, ఆ సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. గాయపడిన వారిని ‘గోల్డెన్ అవర్’లో అంటే గంటలోపే దవాఖానకు చేర్చితే ప్రాణాలు కాపాడవచ్చని ఆయన తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రమాదాలే కాకుండా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు తన కుటుంబం, తన భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని భాద్యతాయుతంగా వాహనాలు నడపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టోల్ ప్లాజా సిబ్బంది, పోలీసు సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.

Bibinagar : ‘ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రాణాలకు భద్రత’